హెరిటేజ్‌ షేరుకు షాక్‌! రెండు రోజుల్లో 20 శాతం డౌన్ | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌ షేరుకు షాక్‌! రెండు రోజుల్లో 20 శాతం డౌన్

Published Wed, Sep 13 2023 7:06 AM

Heritage Share 20 Percent Down in Two Days - Sakshi

హైదరాబాద్‌: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో హెరిటేజ్‌ ఫుడ్స్‌ వాటాదారులకు షాక్‌ తగిలింది. చంద్రబాబు కుటుంబం కంపెనీ ప్రధాన ప్రమోటర్‌ కావడంతో షేరు కుప్పకూలింది. శనివారం చంద్రబాబును అరెస్ట్‌ చేసిన తర్వాత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేరు ధర దాదాపు 19 శాతం క్రాష్‌ అయ్యింది. మంగళవారం ఒక్కరోజే 12.5 శాతం (రూ.32) క్షీణించి రూ.221 వద్ద ముగిసింది. 

భారీ వాల్యూమ్‌తో (దాదాపు 24 లక్షల షేర్లు చేతులు మారాయి) షేరు పడిపోవడం చూస్తే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం ఉన్నట్లు కనబడుతోందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరెస్ట్‌కు ముందు, అంటే శుక్రవారం (సెప్టెంబర్‌ 8న) ట్రేడింగ్‌ ముగింపు నాటికి షేరు ధర దాదాపు రూ.272 వద్ద ఉంది. షేరు కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపద కూడా భారీగా ఆవిరవుతోంది.

గత రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (విలువ) ఏకంగా రూ.450 కోట్ల మేర కరిగిపోయింది. మంగళవారం ట్రేడింగ్‌ ముగింపు నాటికి ఇది రూ.2,073 కోట్లకు దిగొచ్చింది. కాగా, హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేరు ఏడాది గరిష్ట స్థాయి రూ.287 కాగా, కనిష్ట స్థాయి రూ.135గా నమోదైంది. కంపెనీలో ప్రమోటర్లకు (చంద్రబాబు కుటుంబం) సుమారు 41.58 శాతం వాటా ఉంది.

‘ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు’ అక్రమాల్లో హెరిటేజ్‌..
చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణాలపై ఏపీ సీఐడీ విచారణ జోరు పెంచడం, వీటిలో బాబు కుటుంబంతో పాటు హెరిటేజ్‌ కంపెనీకి కూడా ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు బయటపడటంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఒకపక్క, ‘స్కిల్‌’ స్కామ్‌లో ఇప్పటికే చంద్రబాబు అరెస్టయ్యి రిమాండ్‌లో ఉన్నారు. 

ఇదే తరుణంలో అమరావతి ‘ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు‘ ప్రాజెక్టులో సైతం బాబు అండ్‌ కో అందినకాడికి దోచుకున్నారన్న పక్కా ఆధారాలతో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్‌ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులోనూ బాబును అరెస్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. 

ఈ స్కామ్‌లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ కూడా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ వెంబడి భూములు కొనుగోలు చేసినట్లు ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో వెలికితీయడం గమనార్హం. వీటన్నింటి ప్రభావంతో రానున్న రోజుల్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకులేకుండా చేసే అవకాశం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. దీంతో షేరు మరింత కుప్పకూలే అవకాశం ఉందనేది వారి విశ్లేషణ.

 
Advertisement
 
Advertisement