
సాక్షి, ముంబై: భారతదేశంలో ప్రముఖ గృహ రుణ సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ వివిధ కాలపరిమితుల స్థిర డిపాజిట్ పథకాలపై 25 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ వడ్డీరేటు పెంచింది. మార్చి 30వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. పలు బ్యాంకులు తమ స్థిర డిపాజిట్లపై వడ్డీని తగ్గిస్తున్న నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ వెబ్‌సైట్ తెలుపుతున్న సమాచారం ప్రకారం, ప్రత్యేక స్థిర డిపాజిట్ విషయానికి వస్తే, రూ. 2 కోట్ల వరకూ 33 నెలల పాటు డిపాజిట్ చేస్తే 6.20 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. 66 నెలల మెచ్యూరిటీ విషయంలో 6.60% వడ్డీ అమలవుతుంది. 99 నెలల స్థిర డిపాజిట్లపై 6.65 శాతం వడ్డీ అందుతుంది.