ఎయిరిండియా విక్రయ ఒప్పందం ఖరారు

Govt signs share purchase agreement with Tata Sons - Sakshi

అగ్రిమెంట్‌పై టాటా సన్స్, ప్రభుత్వం సంతకాలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి సంబంధించి టాటా సన్స్, కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. సంతకాలు చేశాయి. ఎయిరిండియా డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) వినోద్‌ హెజ్మాదీ, పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర మిశ్రా, టాటా గ్రూప్‌నకు చెందిన సుప్రకాష్‌ ముఖోపాధ్యాయ్‌.. షేర్ల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు.

పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ... మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ఈ విషయం ట్వీట్‌ చేశారు. టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ.. ఎయిరిండియాలో 100 శాతం వాటాలను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 18,000 కోట్లు. ఇందులో రూ. 2,700 కోట్ల మొత్తాన్ని టాలేస్‌ నగదు రూపంలో చెల్లించనుండగా, మిగతా రూ. 15,300 కోట్ల రుణభారం కంపెనీకి బదిలీ కానుంది.     ఎయిరిండియా విక్రయాన్ని నిర్ధారిస్తూ అక్టోబర్‌ 11న టాటా గ్రూప్‌నకు కేంద్ర ప్రభుత్వం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ) జారీ చేసింది.

ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా మొత్తం రుణ భారం రూ. 61,562 కోట్లుగా ఉంది. ఇందులో 75 శాతం భారాన్ని (రూ. 46,262 కోట్లు) స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏఐఏహెచ్‌ఎల్‌కు ప్రభుత్వం బదలాయిస్తోంది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఏఐఎస్‌ఏటీఎస్‌లో 50 శాతం వాటాలను రూ. 12,906 కోట్ల రిజర్వ్‌ ధరతో వేలం వేయగా, అత్యధికంగా కోట్‌ చేసి టాటా గ్రూప్‌ విజేతగా నిల్చింది. ప్రైవేట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అజయ్‌ సింగ్‌ రూ. 15,100 కోట్లకు బిడ్‌ వేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top