పెంటగాన్ ఏఐ డీల్‌తో గూగుల్‌లో సంక్షోభం | Google Android Security Director Quits Over Pentagon AI Deal Sundar Pichai | Sakshi
Sakshi News home page

పెంటగాన్ ఏఐ డీల్‌తో గూగుల్‌లో సంక్షోభం

Jun 12 2026 2:34 PM | Updated on Jun 12 2026 2:34 PM

Google Android Security Director Quits Over Pentagon AI Deal Sundar Pichai

సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి కంపెనీల్లో ఉద్యోగులు బలవంతంగా బయటకు వెళ్తున్న తరుణంలో గూగుల్‌కు చెందిన ఒక టాప్ డైరెక్టర్ తన నైతిక విలువల కోసం కోట్లాది రూపాయల ప్యాకేజీని, అత్యున్నత హోదాను స్వచ్ఛందంగా వదులుకున్నారు. గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ సెక్యూరిటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రెనే మేర్హోఫర్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్)తో గూగుల్ కుదుర్చుకున్న వివాదాస్పద కృత్రిమ మేధ ఒప్పందమే ఇందుకు ప్రధాన కారణం. రాజీనామా లేఖను వ్యక్తిగత బ్లాగ్ పోస్ట్‌లో బహిర్గతం చేస్తూ గూగుల్ మేనేజ్‌మెంట్ తన నైతికతను కోల్పోయిందని రెనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2017వ సంవత్సరంలో గూగుల్ నుంచి వచ్చిన తిరస్కరించలేని ఆఫర్‌తో రెనే మేర్హోఫర్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ సెక్యూరిటీ డైరెక్టర్‌గా చేరారు. దాదాపు దశాబ్ద కాలం పాటు సేవలందించిన ఆయన, తొమ్మిదేళ్ల క్రితం తాను చేరిన నాటి గూగుల్ సంస్కృతికి, నేటి గూగుల్ వైఖరికి అసలు పొంతన లేదని స్పష్టం చేశారు.

‘ప్రపంచ స్థాయిలో అద్భుతాలు చేయడానికి గూగుల్ ఒక సరైన వేదిక. ఇక్కడి పారదర్శక సంస్కృతి, భిన్న అభిప్రాయాలకు ఇచ్చే గౌరవం నన్ను ఆకర్షించాయి. ఒక గూగులర్‌గా మా సొంత గుర్తింపును, విలువలను పనిలో చూపించే స్వేచ్ఛ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నత స్థాయి యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ సంస్కృతిని దెబ్బతీశాయి’ అని జోహన్నెస్ కెప్లర్ యూనివర్శిటీ లింజ్‌లో ప్రొఫెసర్‌గా, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ నెట్‌వర్క్స్ అండ్ సెక్యూరిటీ అధిపతిగా కూడా ఉన్న మేర్హోఫర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ, ప్రైవసీ ఇంజినీరింగ్ ఉపాధ్యక్షుడు డేవ్ క్లీడర్మాకర్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ సెక్యూరిటీ హెడ్ నిక్ క్రాలెవిచ్‌లు తనపై ఉంచిన నమ్మకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సుందర్ సొంత ఏఐ సూత్రాలను పక్కనబెట్టారా?

2018లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా కొన్ని ఏఐ సూత్రాలను ప్రకటించారు. వాటి ప్రకారం గూగుల్ అభివృద్ధి చేసే ఏఐ అప్లికేషన్లు కింది అంశాలకు విరుద్ధంగా ఉండకూడదు.

1. ఆయుధాల తయారీ లేదా ప్రజలకు ప్రత్యక్షంగా గాయం కలిగించే సాంకేతికతలు.

2. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ సామూహిక నిఘా కోసం సమాచారాన్ని సేకరించడం.

3. అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల సూత్రాలను ఉల్లంఘించే సాంకేతికతలు.

అయితే, ప్రస్తుత పెంటగాన్ ఒప్పందం ద్వారా గూగుల్ యాజమాన్యం ఈ నియమాలను నిశ్శబ్దంగా తుంగలో తొక్కిందని మేర్హోఫర్ ఆరోపించారు. అమెరికా రక్షణ శాఖ ఏదైనా చట్టబద్ధమైన ఉద్దేశం కోసం తమ ఏఐ నమూనాలను వాడుకునేలా గూగుల్ ఒప్పందం చేసుకుందని, అయితే అవి ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు రుజువైందని ఆయన ఎండగట్టారు.

ఉద్యోగుల తీవ్ర నిరసన

అమెరికా రక్షణ శాఖకు క్లాసిఫైడ్ ఏఐ సేవలు అందించడాన్ని గూగుల్ అంతర్గత ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రక్షణ శాఖతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ 600 మందికి పైగా ఉద్యోగులు సంతకాలు చేసిన లేఖను సీఈఓ సుందర్ పిచాయ్‌కు పంపినప్పటికీ యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. ఈ నిర్ణయాలన్నీ కేవలం ఉన్నత స్థాయి యాజమాన్యం మాత్రమే తీసుకుందని, అంతర్గత ఛానెళ్ల ద్వారా తమలాంటి డైరెక్టర్లకు కూడా కనీస సమాచారం ఇవ్వలేదని మేర్హోఫర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో..

Advertisement
 
Advertisement
Advertisement