మూడు నెలల్లో రూ.404 కోట్ల విలువైన బంగారం వేలం

Gold loans to pick up pace in Q2: Manappuram Finance - Sakshi

వేలం బాటన బ్యాంకింగ్‌

2020–21 మార్చి త్రైమాసికంలో మణప్పురం విక్రయం వెయ్యి కేజీలు

మహమ్మారి వల్ల ప్రజానీకం పడుతున్న కష్టాలకు నిదర్శనం

సెప్టెంబర్‌ త్రైమాసికం నుంచీ ఎన్‌పీఏ సెగ తీవ్రత!

ఆందోళన కలిగిస్తున్న పరిశ్రమ గణాంకాలు    

ముంబై: పసిడి రుణాల విషయంలో బ్యాంకింగ్‌లో ‘బబుల్‌’ ఆందోళనలు తలెత్తుతున్న పరిస్థితి కనిసిస్తోంది. మణప్పురం ఫైనాన్స్‌ వంటి పసిడి హామీగా రుణాలను మంజూరుచేసే బ్యాంకింగ్‌యేతర ఫైనాన్షియల్‌ సంస్థలు(ఎన్‌బీఎఫ్‌సీ) బంగారాన్ని పెద్ద ఎత్తున వేలం వేసే పరిస్థితి నెలకొంది. ఒక్క మణప్పురం ఫైనాన్స్‌ 2021 జనవరి-మార్చి మధ్య రికార్డు స్థాయిలో దాదాపు రూ.404 కోట్ల విలువైన టన్ను బంగారాన్ని వేలం వేసింది. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. 2021-22 సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకింగ్‌కూ మొండిబకాయిల(ఎన్‌పీఏ) సెగ తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 

  • మహమ్మారి వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రజానీకం  కష్టాల నుంచి గట్టెక్కడానికి 2020లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పలు చర్యలు తీసుకుంది. తనఖాలకు సంబంధించి పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలను అందించవచ్చన్నది ఆర్‌బీఐ సడలించిన నిబంధనల్లో ఒకటి. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో (ఆగస్టులో గ్రాముకు గరిష్టంగా రూ.5,600 పలికింది) కష్టకాలంలో ఈ మెటల్‌ ప్రజలను ఆదుకుంది.  
  • ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పసిడి పోర్ట్ ఫోలియోలూ భారీగా పెరిగాయి. 2020-21లో ఈ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. 2019-20లో ఈ విలువ రూ.1.6 లక్షల కోట్లు కావడం గమనార్హం.  
  • పసిడి రుణ పరిశ్రమ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు. ఇందులో 75 శాతం వాటా అసంఘటిత, చిన్నపాటి రుణదాతలదే. బ్యాంకింగ్‌ వంటి వ్యవస్థీకృత సంస్థల వాటా కేవలం 25 శాతం (రూ.2 లక్షల కోట్లు). 2020-21లో వ్యవస్థీకృత రంగంలో బ్యాంకింగ్‌ పసిడి రుణ పోర్ట్‌ఫోలియో వాటా రూ.1.2 లక్షల కోట్లయితే, ఎన్‌బీఎఫ్‌సీల వాటా రూ.80,000 కోట్లు.
  • ఇటీవల మోతీలాల్‌ ఓశ్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విడుదల చేసిన ఒక నివేదిక ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో (మొదటి వేవ్లో) ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయింది. ప్రభుత్వం భరించిన నష్టం 20 శాతమే. ఇందులోనూ కార్పొరేట్‌ రంగం కేవలం 12 నుంచి 16 శాతం భరిస్తే, మిగిలినది కుటుంబాలు భరించాయి.

త్రైమాసికాల్లోనే టాప్‌...
మార్చి త్రైమాసికంలో మేము దాదాపు రూ.404 కోట్ల విలువైన 1,000 కేజీల తనఖా బంగారాన్ని వేలం వేశాము. అంతక్రితం మూడు త్రైమాసికాల్లో కేవలం రూ.8 కోట్ల విలువచేసే పసిడినే వేలం వేశాం. ఒక త్రైమాసికంలో వేలం ద్వారా రూ.404 కోట్ల రికవరీ ఇదే తొలిసారి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రికవరీలు రికార్డు స్థాయిలో రూ.1,932 కోట్లు. ఇక ఇప్పటికి మా ఖజానాలో 300 టన్నుల పసిడి ఉంది. కాగా, బ్యాంకులు, ఇతర పోటీ సంస్థలు ఆరు నుంచి 12 నెలల కాలానికి పసిడీ రుణ కాలపరిమితులను అనుసరిస్తుండగా, మేము మూడు నెలల కాలపరిమితినే అనుసరిస్తున్నాం. అందువల్ల మేము ప్రతి నేలా పసిడి వేలం నిర్వహిస్తాము. 

నిజానికి 2020లో ధరలు భారీగా పెరిగాయి. పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ధరలు అప్పటితో పోల్చితే భారీగా పడిపోయాయి. దీనితో ఈ రుణాల విషయంలో ‘బబుల్‌’ ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఏడాది వరకూ రుణ కాలపరిమితి ఉన్నందున, బ్యాంకులు అలాగే ఇతర ఎన్‌బీఎఫ్‌సీలు తమ రుణ నాణ్యత సమస్యలపై మార్చి లేదా జూన్‌ త్రైమాసికం వరకూ తమ రుణ నాణ్యతను తెలియజేయవు. అయితే ఈ విషయంలో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ ఎన్‌పీఏల సెగ తీవ్రమయ్యే అవకాశం ఉంది. తమ గోల్డ్‌ రుణ పుస్తకంలో దాదాపు 90 శాతాన్ని బ్యాంకులు ప్రాధాన్యతా పూర్వక రుణంగా పేర్కొన్నాయి.
- వీపీ నందకుమార్, మణప్పురం ఎండీ, సీఈఓ 

బ్యాంకులకు ఎన్‌పీఏల తీవ్రత! 
గ్రాము ధర రూ.5,600 ఉన్న గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, ఇప్పుడు ధరలు 10 నుంచి 13 శాతం పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకుల రుణ నాణ్యత సమస్యలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి మా సంస్థ భారీ వేలాలు ఏవీ నిర్వహించలేదు. మా రుణ కాలపరిమితి 9 నుంచి 12 నెలలు ఉండడమే దీనికి కారణం.  
- థామస్‌ జాన్‌ ముత్తూట్, ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top