గోల్డ్‌ ఫండ్స్‌కు అమ్మకాల ఒత్తిడి

Gold ETFs log Rs 248-cr outflow in Feb as investors prefer equity funds - Sakshi

ఫిబ్రవరిలో రూ.248 కోట్లు

ఉపసంహరణ జనవరితో పోలిస్తే కాస్త తగ్గుముఖం

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఈక్విటీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో బంగారం ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు)కు ఫిబ్రవరిలో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. రూ.248 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. బంగారం ఈటీఎఫ్‌ల నుంచి నికరంగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం అంతకుముందు నెలలోనూ నమోదైంది. జనవరిలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి మరింత మొత్తంలో రూ.452 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అంతకుముందు కాలం లో ప్రతి నెలా నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం.

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే ఈ విష యం తెలుస్తోంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చోటుచేసుకున్నా కానీ.. ఈ పథకాల నిర్వహణలోని పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.17,839 కోట్లుగా ఉంటే.. ఫిబ్రవరి ఆఖరికి రూ.18,727 కోట్లకు పెరిగింది. ఫోలియోల సంఖ్య కూడా ఫిబ్రవరిలో 3.09 లక్షలు పెరిగి 37.74 లక్షలకు చేరింది. 2021 మొత్తం మీద గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.4,814 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. అంతకుముందు 2020లో వచ్చినమొత్తం రూ.6,657 కోట్లుగా ఉంది.  

ఇతర అవకాశాల కోసం..  
బంగారాన్ని పెట్టుబడుల వైవిధ్య సాధనంగా చూసే ధోరణి పెరిగినట్టు, మార్కెట్‌ అస్థిరతలకు హెడ్జ్‌ సాధనంగా పరిగణిస్తున్నట్టు ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతి రాతి గుప్తా తెలిపారు. ప్రస్తుత పెట్టుబడుల ఉపసంహరణను పరిశీలిస్తే.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఈక్విటీకి (పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్సింగ్‌) మళ్లించడం, ఈక్విటీ మార్కెట్లలో కరెక్షన్‌ను అవకాశంగా మలుచుకోవడం కారణమై ఉంటుందని గుప్తా పేర్కొన్నారు. అలాగే, బంగారం ధరలు పెరగడంతో ట్రేడర్లు తమ లాభాలను బుక్‌ చేసుకుని ఉంటారని ఆమె చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top