‘జెఫ్‌ బెజోస్‌’ను అధిగమించి..ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీకి 3వ స‍్థానం

Gautam Adani Overtakes Jeff Bezos Again, Back To The Third Billionaires In Forbes - Sakshi

ప్రముఖ బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ను అధిగమించారు. మూడు స‍్థానాన్ని కైవసం చేసుకున్నారు.   

గత రెండు వారాలుగా అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌ వాల్‌ స్ట్రీట్‌లో నమోదైన కంపెనీల షేర్ల కంటే..అదానీ కంపెనీల షేర్లు లాభాల పంట పండించాయి. వెరసీ సోమవారం నాటికి అదానీ సంపదలోకి మరో 314 మిలియన్‌ డాలర్లు వచ్చి చేరగా..ఆయన మొత్తం సంపద 131.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో ప్రముఖ ఫ్యాషన్‌ సంస్థ లూయిస్ విట్టన్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 156.5 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ తర్వాతి స్థానంలో అదానీ నిలిచారు. 

అదానీకి కలిసొచ్చింది
ఆర్ధిక పరమైన అంశాల్లో ఆర్‌బీఐ ఆచితూచి అడుగులు వేయడం, చమురు ధరలు తగ్గే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మూడో వారంలో దేశీయ స్టాక్‌ సూచిలకు పై అంశాలు కలిసొచ్చాయి. సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో షేర్లు భారీ లాభాలతో పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో అదానీ షేర్లు పుంజుకోవడం, ప్రపంచంలో ధనవంతుల జాబితాలో జెఫ్‌బెజోస్‌ను వెనక్కి నెట్టడం వెనువెంటనే జరిగిపోయాయి.   

బెజోస్‌ షాక్‌.. అదానీ రాక్‌
గత గురువారం అమెజాన్‌ చరిత్రలో అత్యంత దారుణమైన రికార్డులు నమోదయ్యాయి. సెలవులు, షాపింగ్ సీజన్ ఉన్నప్పటికీ అమెజాన్‌. కామ్ సేల్స్‌ తగ్గిపోయాయి. దీంతో ఆ ఒక్కరోజే మార్కెట్‌ ముగిసే సమయానికి అమెజాన్‌ షేర్లు 21 శాతానికి క్షీణించడంతో ఫోర్బ్స్‌ బిలియనీర్స్‌ జాబితాలో జెఫ్‌ బెజోస్‌ తన ఉనికిని కోల్పోతుండగా అదానీ ఒక్కొక్కరిని దాటుకుంటూ వెళుతున్నారు.   

స్టాక్‌ మార్కెట్‌లో గందర గోళం
126.9 బిలియన్‌ డాలర్ల సంపదతో ధనవంతుల జాబితాలో జెఫ్ బెజోస్‌ను అదానీ అధిగమించినప్పటికీ..ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న గందర గోళంతో ఫోర్బ్స్ జాబితాలోని ర్యాంకింగ్‌లు మారుతున్నాయి. 
  
బిలియనీర్ల మ్యూజికల్‌ చైర్‌ గేమ్‌ 
స్టాక్ మార్కెట్ల పనితీరుతో బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ సంపదలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటి ఆధారంగా ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ మారుతోంది. అయినప్పటికీ ఈ ముగ్గురు బిలయనీర్ల మధ్య వ్యత్యాసం సుమారు 30 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇటీవలి వారాల్లో గౌతమ్ అదానీ, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ మధ్య మ్యూజికల్ చైర్‌ గేమ్ నడుస్తోంది. 2,3,4 ఇలా ధనవంతుల జాబితాల్లో వారి స్థానం కోసం పోటీపడుతున్నప్పటికీ ఎలాన్‌ మస్క్ మాత్రం 223.8 నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రథమ స్థానంలో దూసుకెళ్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top