
ఉమాంగ్ యాప్‌లో (UMANG App) యూఏఎన్ (UAN) యాక్టివేషన్‌కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO ఈపీఎఫ్ఓ) కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యూఏఎన్ పొందడానికి, యాక్టివేట్ చేసుకునేందుకు ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ (ఎఫ్ఏటీ)ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త ప్రక్రియ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది.
యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఈపీఎఫ్ఓ సభ్యులు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు, వివరాలను అప్డేట్ చేసేందుకు, ఈపీఎఫ్ నిధులను ఉపసంహరించుకునేందుకు, ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) వంటి పథకాల కింద ప్రయోజనాలు పొందడానికి యూఏఎన్ అవసరం. యూఏఎన్ యాక్టివేట్ చేయకుండా సభ్యులు ఈ ఆన్‌లైన్ సేవలను పొందలేరు.
ఉమాంగ్ యాప్ గురించి..
యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ (ఉమాంగ్) అనేది ఒక ప్రభుత్వ యాప్. ఇది ఒకే ప్లాట్‌ఫామ్‌పై అనేక ఈ-గవర్నెన్స్ సేవలను అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా పౌరులు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సంస్థల సేవలను వినియోగించుకోవచ్చు.
ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు వారి యూఏఎన్‌ను జనరేట్ లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ రికార్డులను అప్డేట్ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లకుండానే తమ స్మార్ట్‌ఫోన్ల నుండి నేరుగా వారి ఈ-యూఏఎన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ కార్మికులు, నేపాల్, భూటాన్ పౌరులకు తప్ప మిగతా ఉద్యోగులందరికీ ఆగస్టు 1 నుంచి ఉమాంగ్ యాప్ ద్వారా యూఏఎన్ జనరేషన్ లేదా యాక్టివేషన్‌కు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్‌ను ఈపీఎఫ్‌వో తప్పనిసరి చేసింది.