వేతన జీవులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి రోజులు త్వరలోనే రానున్నాయి. తమ కష్టార్జితమైన ప్రావిడెంట్ ఫండ్ (PF) నగదును పొందే ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ఈపీఎఫ్ఓ (EPFO) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2026 మధ్య నాటికి 'ఈపీఎఫ్ఓ 3.0' పేరుతో సరికొత్త అప్‌గ్రేడెడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త మార్పులతో పీఎఫ్ ఉపసంహరణలు ఇకపై బ్యాంక్ లావాదేవీలంత సులభం కానున్నాయి. ఈ వ్యవస్థలో రాబోయే ప్రధాన మార్పులు ఇవే..
ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు ఉపసంహరణ
ఈపీఎఫ్ఓ 3.0 లో అతిపెద్ద అప్‌డేట్ ఏంటంటే.. ఇకపై మీరు మీ పీఎఫ్ నగదును నేరుగా ఏటీఎంల ద్వారా లేదా యూపీఐ (UPI) యాప్స్ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. పేపర్ వర్క్, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కేవలం ఆధార్ ఓటీపీ ధ్రువీకరణతో నేరుగా లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోకి నగదు జమ అవుతుంది.
రూ. 5 లక్షలకు పెరిగిన ఆటో-సెటిల్‌మెంట్ పరిమితి
గతంలో ఆటో-సెటిల్‌మెంట్ పరిమితి కేవలం రూ. 1 లక్ష వరకు మాత్రమే ఉండేది. దీన్ని ఇప్పుడు ఏకంగా రూ. 5 లక్షలకు పెంచారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో క్లెయిమ్ చేసిన కేవలం గంట వ్యవధిలోనే లేదా మరుసటి రోజు కల్లా నగదు చేతికి అందుతుంది.
కంపెనీ ఆమోదం అక్కర్లేదు!
చాలా సందర్భాల్లో కంపెనీలు క్లెయిమ్‌లను ధ్రువీకరించడంలో ఆలస్యం చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడేవారు. కొత్త వ్యవస్థలో ఈ డిపెండెన్సీని తొలగిస్తున్నారు. ఆధార్ ఓటీపీ ద్వారా లేదా స్వీయ-ధ్రువీకరణ ద్వారా క్లెయిమ్‌లను వేగంగా సెటిల్ చేసుకోవచ్చు.
ఫోన్ పే, గూగుల్ పేతో అనుసంధానం
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో ఈపీఎఫ్ఓ ఒప్పందం కుదుర్చుకుంటోంది. దీనివల్ల ఫోన్‌పే (PhonePe) గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm) వంటి పాపులర్ డిజిటల్ వాలెట్ల ద్వారా కూడా పీఎఫ్ లావాదేవీలను సులభంగా నిర్వహించే వెసులుబాటు కలుగుతుంది.
ఉపసంహరణ నిబంధనల సరళీకరణ
వినియోగదారుల సౌకర్యార్థం ఉపసంహరణ కేటగిరీలను ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది.
వైద్య అవసరాలు: సర్వీస్ నిబంధన లేకుండా ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు.
చదువు/వివాహం: నిర్ణీత సర్వీసు కాలం తర్వాత అనుమతి ఉంటుంది.
గృహ అవసరాలు: ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి కనీసం 5 ఏళ్ల సర్వీసు ఉండాలి.
నిరుద్యోగం: ఒక నెల పాటు ఖాళీగా ఉంటే 75% నగదు, రెండు నెలలు దాటితే పూర్తి నగదు ఉపసంహరించుకోవచ్చు.
ఈ వేగవంతమైన సేవలను పొందాలంటే మీ యూఏఎన్ (UAN) యాక్టివ్‌గా ఉండటంతో పాటు, దానికి ఆధార్, పాన్, సరైన బ్యాంక్ ఖాతా వివరాలు లింక్ అయి ఉండాలి. ప్రస్తుతం ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి 32 ప్రముఖ బ్యాంకులతో ఈపీఎఫ్ఓ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇక పన్ను నిబంధనల విషయానికి వస్తే.. 5 ఏళ్ల నిరంతర సర్వీసు తర్వాత ఉపసంహరించుకునే నగదుపై పన్ను ఉండదు. అయితే, రూ. 50,000 మించిన విత్ డ్రాయల్స్ విషయంలో పాన్ కార్డు లింక్ చేయకపోతే టీడీఎస్ (TDS) వర్తిస్తుంది. మొత్తానికి, ఈపీఎఫ్ఓ 3.0 అందుబాటులోకి వస్తే కోట్లాది మంది వేతన జీవుల డిజిటల్ కల సాకారమై, పీఎఫ్ సెటిల్‌మెంట్లలో కొత్త శకం మొదలుకానుంది.


