రూ. 9 వేల కోట్ల రికవరీ..ఇలా రాబట్టారు!

ED recovers Rs 9,000-cr for banks in Mallya, Modi-Choksi fraud cases - Sakshi

మాల్యా, మోదీ, చోక్సీ కేసుల్లో ఇప్పటిదాకా పురోగతి ఇది...

మాల్యా షేర్లు మరిన్ని విక్రయించిన బ్యాంకులు

దీంతో 3 కేసుల్లో 40% దాకా వెనక్కి

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడి

న్యూఢిల్లీ: రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకి యునైటెడ్‌ బ్రూవరీస్‌ (యూబీఎల్‌)లో ఉన్న షేర్లలో కొంత భాగాన్ని బ్యాంకుల తరఫున రుణాల రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ) బుధవారం విక్రయించింది. వీటి విలువ సుమారు రూ. 5,824 కోట్లు. దీనితో భారీగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ, విజయ్‌ మాల్యా కేసుల్లో బ్యాంకులు ఇప్పటిదాకా సుమారు రూ. 9,041 కోట్లు దాకా రికవర్‌ చేసుకున్నట్లయింది. వారు ముగ్గురూ ఎగవేసిన మొత్తంలో (దాదాపు రూ. 22,000 కోట్లు) ఇది సుమారు 40 శాతం. ఈ కేసుల్లో వారి ఆస్తులను జప్తు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.  

25న మాల్యా షేర్లు మరిన్ని.. ‘మాల్యా, చోక్సీ, మోదీల వల్ల బ్యాంకులకు సుమారు రూ. 22,585 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ కేసులకు సంబంధించి అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ.. బ్యాంకులకు వాటిల్లిన నష్టంలో దాదాపు 80 శాతం (రూ. 18,170 కోట్లు) ఉంటుంది‘ అని ఈడీ  పేర్కొంది. మాల్యా కేసుల విచారణ సందర్భంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు (పీఎంఎల్‌ఏ) ఆదేశాల మేరకు తాము జప్తు చేసిన సుమారు రూ. 6,624 కోట్ల విలువ చేసే యూబీఎల్‌ షేర్లను ఎస్‌బీఐ కన్సార్షియంకు ఈడీ బదలాయించింది.

ఇందులో నుంచి రూ. 5,824 కోట్ల విలువ చేసే షేర్లను బ్యాంకుల తరఫున బుధవారం డీఆర్‌టీ విక్రయించింది. జూన్‌ 25న మరో రూ. 800 కోట్ల షేర్లను విక్రయించే అవకాశం ఉందని ఈడీ తెలిపింది. ఇక పరారైనవారు, ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి ఆస్తులను జప్తు చేసుకుని, బాకీలన్నీ రాబడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ఈ మేరకు ట్వీట్‌ చేశారు. మరోవైపు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రకటనపై స్పందిస్తూ, ఈడీ అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ.. బ్యాంకులకు రావాల్సిన బాకీలకన్నా ఎక్కువే ఉంటుందని చోక్సీ తరఫు న్యాయవాది విజయ్‌ అగర్వాల్‌ వ్యాఖ్యానించారు.  

ఇలా రాబట్టారు..
ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును (పీఎన్‌బీ) రూ. 13,000 కోట్లు మేర మోసగించారని వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్‌ చోక్సీ, బ్యాంకుల కన్సార్షియంకు సుమారు రూ. 9,000 కోట్లు ఎగవేశారని మాల్యా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి.. మాల్యాకి చెందిన షేర్లను గతంలో కూడా విక్రయించిన బ్యాంకులు సుమారు రూ. 1,357 కోట్లు రాబట్టుకోగలిగాయి. నీరవ్‌ మోదీ కేసులో రూ. 1,060 కోట్ల విలువ చేసే అసెట్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మాల్యాకు చెందిన మరిన్ని షేర్లను విక్రయించడంతో బ్యాంకులు మొత్తం ఈ మూడు కేసులకు సంబంధించి రూ. 9,000 కోట్ల పైగా రాబట్టుకోగలిగినట్లయింది. ఈ ముగ్గురు బోగస్‌ సంస్థలను ఉపయోగించి, బ్యాంకుల నుంచి తీసుకున్న నిధులను మళ్లించారని తమ విచారణతో స్పష్టంగా రుజువు చేయగలిగినట్లు ఈడీ తెలిపింది. వీరిని స్వదేశం రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top