
న్యూఢిల్లీ: పన్నా–ముక్తా, తపతి చమురు, గ్యాస్ క్షేత్రాలకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్, షెల్‌తో నెలకొన్న వివాదంలో కేంద్రానికి చుక్కెదురైంది. రిలయన్స్, షెల్‌కు 111 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలంటూ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం చేసిన అప్పీలును ఇంగ్లీష్ హైకోర్టు తోసిపుచ్చింది. 2021లో ఉత్తర్వులు రావడానికి ముందు జరిగిన వాదనల్లోనే, ఆయా సంస్థలకు నిర్దేశిత అర్హతలు లేవన్న అభ్యంతరాలను కేంద్రం తెలియజేయాల్సిందని పేర్కొంది. ఇంగ్లీష్ చట్టాల ప్రకారం గత విచారణలో లేవనెత్తాల్సిన అంశాలను మరో కొత్త ప్రొసీడింగ్స్‌లో ప్రస్తావించడానికి లేదని స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోర్టు ఆదేశాలను పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకి వెడితే, పన్నా–ముక్తా, తపతి క్షేత్రాలను 1994లో ఓఎన్‌జీసీ, రిలయన్స్, ఎన్రాన్ ఆయిల్ అండ్ గ్యాస్ కన్సార్షియం దక్కించుకుంది. 2002లో జేవీలో ఎన్రాన్ వాటాను బీజీఈపీఐఎల్ కొనుగోలు చేసింది. అటుపై బీజీఈపీఐఎల్‌ను షెల్ టేకోవర్ చేసింది. ఆయా క్షేత్రాలపై పెట్టిన వ్యయాల రికవరీ, లాభాల్లో ప్రభుత్వానికి పంచాల్సిన వాటాల లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. దీనిపై 2016లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే దీని ఆధారంగా 3.85 బిలియన్ డాలర్లు కట్టాలంటూ రిలయన్స్, బీజీఈపీఐఎల్‌కు ప్రభుత్వం సూచించింది. దీనిపై ఆయా సంస్థలు అప్పీలుకు వెళ్లగా వాటికి 11 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వులపైనే ప్రభుత్వం తాజాగా ఇంగ్లీష్ కమర్షియల్ కోర్టును ఆశ్రయించగా, చుక్కెదురైంది.