పెంపు ఇక నిదానమే!

Deutsche Bank estimates on Repo rate hike - Sakshi

వచ్చే సమీక్షలో పావు శాతం పెంపు 

డాయిష్‌ బ్యాంకు అంచనా 

ముంబై: రెపో రేటు పెంపు విషయంలో ఆర్‌బీఐ ఇకమీదట దూకుడుగా వ్యవహరించకపోవచ్చని డాయిష్‌ బ్యాంకు అంచనా వేసింది. రేటును పావు శాతం మేర పెంచొచ్చని పేర్కొంది. మే నుంచి ఇప్పటి వరకు మూడు విడతలుగా 1.40 శాతం మేర రెపో రేటును ఆర్‌బీఐ పెంచడం తెలిసిందే. రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం గరిష్ట పరిమితి దాటిపోవడంతో కట్టడి చేయడాన్ని ప్రాధాన్యంగా భావించి వరుసగా రేట్లను పెంచుతూ వస్తోంది.

ఇక నుంచి రేట్ల పెంపు నిదానంగా ఉండొచ్చని డూచే బ్యాంకు తెలిపింది. ఆర్‌బీఐ ఆగస్ట్‌ సమీక్ష మినిట్స్‌ విడుదల కాగా, దీని ఆధారంగా ఈ అంచనాలకు వచ్చింది. క్రమబద్ధంగా, చురుగ్గా చర్యలు ఉండాలన్న ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటన కీలకమైనదిగా పేర్కొంది. ఆర్‌బీఐ ఈడీ రాజీవ్‌ రంజన్‌ సైతం ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని డాయిష్‌ గుర్తు చేసింది.

మానిటరీ పాలసీ స్థిరత్వం కోసం మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయని ఆర్‌బీఐ మినిట్స్‌ ఆధారంగా తెలుస్తున్నట్టు దేశీ బ్రోకరేజీ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ సైతం తెలిపింది. రెపో రేటు 5.75–6 శాతానికి చేరొచ్చన్న తన అంచనాలను కొనసాగించింది. రెపో రేటు 5.75 శాతం వద్ద స్థిరపడొచ్చని ఎంకే గ్లోబల్‌ అంచనాగా ఉంది. ప్రస్తుతం రెపో రేటు 5.4 శాతం వద్ద ఉంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top