కరోనా రోగులకు డీఆర్‌డీవో  అద్భుత పరికరం

Covid patient: DRDO develops supplemental oxygen delivery system - Sakshi

డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన వినూత్న పరికరం

అద్భుతమైన ‘ఎస్‌పీవో-2 సప్లిమెంటల్‌ ఆక్సిజన్‌ డెలివరీ సిస్టం’

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌-19 వ్యాధి ముదిరి ఆసుపత్రి పాలు కావద్దనుకుంటే రక్తంలోని ఆక్సిజన్‌ మోతాదు 94 శాతానికి తగ్గకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పల్స్‌ ఆక్సీమీటర్‌ పరికరంతో రక్తంలోని ఆక్సిజన్‌ ఎంతుందో తెలుసుకోవచ్చు కానీ.. తక్కువ ఉంటే అప్పటికప్పుడు ఆక్సిజన్‌ కావాలంటే మాత్రం ఆసుపత్రికి పరుగెత్తాల్సిందే. అయితే డీఆర్‌డీవో పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరకనుంది. సరిహద్దులోని పర్వత ప్రాంతాల్లో గస్తీ కాసే సైనికులకు ఆక్సిజన్‌ అందించేందుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఓ పరికరం ఇప్పుడు కరోనా బాధితులకు వరంగా మారనుంది. బెంగళూరులోని డీఆర్‌డీవోకు చెందిన ‘ది డిఫెన్స్‌ బయో ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రో మెడికల్‌ లేబొరేటరీ’తయరుచేసిన ‘ఎస్‌పీవో-2 సప్లిమెంటల్‌ ఆక్సిజన్‌ డెలివరీ సిస్టం’లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

ఆక్సిజన్‌ సిలిండర్‌కు అనుసంధానమై ఉండే ఈ పరికరం రక్తంలోని ఆక్సిజన్‌ నిర్ణీత మోతాదు కంటే తక్కువైన వెంటనే తనంతట తానే ఆక్సిజన్‌ సరఫరా మొదలుపెడుతుంది. ముంజేతికి కట్టుకునే ఓ పరికరం ద్వారా ఎప్పటికప్పుడు ఎస్‌పీఓ2ను పరిశీలిస్తూ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆక్సిజన్‌ సరఫరా చేస్తుంటుంది. దీంతో వైద్యసిబ్బందిపై ఒత్తిడి తీవ్రంగా తగ్గుతుంది. ఒక లీటర్‌ నుంచి మొదలుకొని 1,500 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుంది. కోవిడ్‌ రోగులకు ఇళ్లలోనే చికిత్స అందించే సందర్భాల్లో ఈ యంత్రం ఉపయుక్తంగా ఉంటుందని డీర్‌డీవో ఓ ప్రకటనలో తెలిపింది. రోగికి అవసరమైనంత ఆక్సిజన్‌ మాత్రమే ఉపయోగిస్తున్న కారణంగా వృథా తగ్గుతుందని తెలిపింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ యంత్రాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top