తూనికలు, కొలతల చట్టాలు సవరిస్తాం

Central Govt To Soon Rephrases Legal Metrology Act Says Piyush Goyal - Sakshi

నిబంధనల భారం తగ్గించేందుకు ప్రతిపాదనలు  

కేంద్ర మంత్రి పియుష్‌ గోయల్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: వ్యాపారాలు, వినియోగదారులపై నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా తూనికలు, కొలతల ప్రమాణాలకు సంబంధించిన లీగల్‌ మెట్రాలజీ చట్టం–2009లో సవరణలు చేయనున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ తెలిపారు. సంబంధిత ముసాయిదా ప్రతిపాదనను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా వివరించారు. ప్రస్తుతం దీనిపై వివిధ వర్గాల అభిప్రాయాలను పరిశీలిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 

ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై అనుచిత వ్యాపార విధానాలను కట్టడి చేసేందుకు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ సవరణలను తలపెట్టినట్లు ఆయన తెలిపారు. చట్టాలు, నిబంధనలను సరళతరం చేసేందుకు సూచనలేమైనా ఉంటే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోయల్‌ చెప్పారు.

 వినియోగదారులు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఫిర్యాదులు చేసేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన ’ఈ–దాఖిల్‌’ సదుపాయానికి క్రమంగా ఆదరణ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 40,000 పైచిలుకు ఫిర్యాదులు ఈ ప్లాట్‌ఫాంపై దాఖలైనట్లు వివరించారు. అయితే, మరింత మందికి దీని గురించి తెలిసే విధంగా అవగాహనను పెంచాల్సి ఉందని చెప్పారు. ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం ఫిర్యాదిదారు సులభంగా ఆన్‌లైన్‌లో అప్పీలు చేసుకోవడానికి, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కోర్టు విచారణకు హాజరవడానికి వీలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. 

చిన్న నగరాల్లో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించాలి .. 
ప్రథమ, ద్వితీయ శ్రేణి చిన్న నగరాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నేషనల్‌ స్టార్టప్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ మూడో సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గోయల్‌ చెప్పారు.

విజయవంతమైన స్టార్టప్‌లు తమ అనుభవాలను యువతతో పంచుకోవాలని, వారిలో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ స్ఫూర్తిని నింపాలని పేర్కొన్నారు. దేశీయంగా అంకుర సంస్థల్లో 45% స్టార్టప్‌లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే ఉంటున్నాయని.. 623 జిల్లాల్లో కనీసం ఒక్కటైనా గుర్తింపు పొందిన స్టార్టప్‌ ఉందని ఆయన తెలిపారు. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2018–21 మధ్య కాలంలో స్టార్టప్‌లు దాదాపు 5.9 లక్షల ఉద్యోగాలు కల్పించాయి.

చదవండి: వారంలో 5 రోజుల కంటే తక్కువ పనిదినాలున్న దేశాలు ఇవే..త్వరలో భారత్‌..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top