‘జీ’, సిటీ నెట్‌వర్క్స్‌పై దివాలా చర్యలు: ఎన్‌సీఎల్‌ఏటీ భారీ ఊరట

Big relief for Zee NCLAT stays insolvency proceedings against media firm - Sakshi

ముంబై:  మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కి భారీ ఊరట లభించింది.  నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) శుక్రవారం జీపై దివాలా చర్యలను ప్రారంభించాలని ఆదేశించిన ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వుపై స్టే విధించింది.

జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునిత్ గోయెంకా, కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలను సవాలు చేస్తూ చేసిన అభ్యర్థనను మేరకు ఈ పరిణామం చోటుచేసుకుంది.  గోయెంకా దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ ప్రైవేట్ రంగ  బ్యాంకు ఇండస్‌ఇండ్ బ్యాంక్‌కు నోటీసు జారీ చేసింది. దీనిపై  విచారణను మార్చి 27వ తేదీకి వాయిదా వేసింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలపై  గోయెంకా  సంతోషం వ్యక్తం చేశారు.అందరి వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రతిపాదిత విలీనాన్ని సకాలంలో పూర్తి చేయడంపై కట్టుబడి  ఉన్నామన్నారు.

కాగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీల్‌), సిటీ నెట్‌వర్క్స్‌పై దివాలా ప్రక్రియకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం  తెలిపడం ఆందోళనకు దారి తీసింది. దీనికి సంబంధించి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ దాఖలు చేసిన పిటీషన్లను విచారణకు స్వీకరించింది. జీల్‌ వ్యవహారంలో సంజీవ్‌ కుమార్‌ జలాన్‌ను, సిటీ నెట్‌వర్క్స్‌ విషయంలో మోహిత్‌ మెహ్రాను దివాలా పరిష్కార నిపుణులుగా (ఆర్‌పీ) నియమించింది. ఉత్తర్వులపై రెండు వారాల స్టే ఇవ్వాల్సిందిగా జీల్‌ కోరినప్పటికీ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ నిరాకరించింది. దీనిపై జీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎండీ పునీత్‌ గోయెంకా .. నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌లో (ఎన్‌సీఎల్‌ఏటీ) సవాలు చేసిన సంగతి తెలిసిందే.

వివరాల్లోకి వెడితే జీ గ్రూప్‌లో భాగమైన సిటీ నెట్‌వర్క్స్‌ వివిధ బ్యాంకుల నుంచి రూ. 850 కోట్లకు మేర రుణాలు తీసుకుంది. జీల్‌ను హామీదారుగా ఉంచి ఇండస్‌ఇండ్‌ నుంచి తీసుకున్న రూ. 89 కోట్ల రుణ చెల్లింపులో సిటీ డిఫాల్ట్‌ కావడంతో తాజా పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సోనీలో జీల్‌ విలీనం తుది దశల్లో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడంతో డీల్‌కు అడ్డంకులు ఏర్పడవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్‌సీఏల్‌ఏటీ  తాజా ఉత్తర్వు సంస్థకు భారీ ఊరట కల్పించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top