
టాప్ బిలియనీర్ గౌతమ్ అదానీకి (Gautam Adani) ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీ ఏసీసీ లిమిటెడ్పై రెండు వేర్వేరు డిమాండ్ నోటీసుల్లో మొత్తం రూ .23.07 కోట్లు జరిమానాలు విధించింది. వీటిని అదానీ గ్రూప్ కంపెనీ అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయాలని యోచిస్తోంది.
ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) జారీ చేసిన డిమాండ్ నోటీసుల్లో 2015-16 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయానికి సంబంధించిన తప్పుడు వివరాలను అందించడం"పై రూ .14.22 కోట్ల జరిమానా విధించగా, 2018-19 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయాన్ని తక్కువగా నివేదించడం"పై మరో రూ .8.85 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.
సవాలు చేస్తాం..
"నిర్ణీత కాలపరిమితిలో ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) ముందు అప్పీళ్లు దాఖలు చేయడం ద్వారా కంపెనీ రెండు ఉత్తర్వులను సవాలు చేస్తుంది. దీంతోపాటు సమాంతరంగా, సంబంధిత ఉత్తర్వుల ప్రకారం లేవనెత్తిన జరిమానా డిమాండ్లపై స్టే కోరుతుంది" అని ఏసీసీ రెగ్యులేటర్ ఫైలింగ్స్లో తెలిపింది. ఈ రెండు డిమాండ్ నోటీసులను అక్టోబర్ 1న స్వీకరించినట్లు చెప్పిన కంపెనీ.. ఈ జరిమానాలు సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపవని తెలిపింది.
అదానీ సిమెంట్ గురించి..
అదానీ సిమెంట్.. అంబుజా సిమెంట్ అనుబంధ సంస్థ. ఇది కంపెనీలో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్లో అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్కు చెందిన హోల్సిమ్ గ్రూప్ నుండి అంబుజా సిమెంట్స్ దాని అనుబంధ సంస్థ ఏసీసీ లిమిటెడ్ను 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.