కార్వీ మాజీ అధికారుల బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్‌ - సెబీ ఆదేశాలు

Attachment Of Bank Accounts Of Ex Officers Of Karvy - Sakshi

న్యూఢిల్లీ: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) క్లయింట్ల నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి రూ. 1.80 కోట్లు రాబట్టేందుకు కార్వీ గ్రూప్‌ మాజీ అధికారులైన ముగ్గురి బ్యాంక్, డీమ్యాట్‌ ఖాతాలు, లాకర్లను అటాచ్‌ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. 

వీరిలో మాజీ వీపీ (ఫైనాన్స్, అకౌంట్స్‌) కృష్ణ హరి జి., మాజీ కాంప్లయెన్స్‌ ఆఫీసర్‌ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్‌ జీఎం శ్రీనివాస రాజు ఉన్నారు. వీరి ఖాతాల నుంచి డెబిట్‌ లావాదేవీలను అనుమతించరాదంటూ బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు సెబీ సూచించింది. అయితే, క్రెడిట్‌ లావాదేవీలకు అనుమతి ఉంటుంది. 

క్లయింట్ల సెక్యూరిటీలను వారికి తెలియకుండా తనఖా పెట్టి కేఎస్‌బీఎల్‌ దాదాపు రూ. 2,033 కోట్ల మేర నిధులు సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈ ఏడాది మే నెలలో సెబీ కృష్ణ హరికి రూ. 1 కోటి, రాజుకి రూ. 40 లక్షలు, శ్రీకృష్ణకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. వడ్డీలు, ఇతర వ్యయాలతో సహా మొత్తం సుమారు రూ. 1.8 కోట్లు కట్టాలంటూ గత నెల డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top