భారత్‌పేలో అనూహ్య పరిణామాలు.. కంపెనీని వీడేందుకు భారీగా డిమాండ్‌ చేస్తున్న ఎండీ గ్రోవర్‌!

Ashneer Grover Demands Huge Sum To Leave BharatPe - Sakshi

BharatPe MD Ashneer Grover Huge Demand Before Investors For Leaving Company: ఫిన్‌టెక్‌ కంపెనీ భారత్‌పేలో అవినీతి ఆరోపణలతో పాటు ప్రవర్తన తీరు సరిగా లేదన్న వ్యవహారంపై  మేనేజింగ్‌ డైరెక్టర్‌ అష్నీర్‌ గ్రోవర్‌ మీద దర్యాప్తు నడుస్తోంది. లావాదేవీల్లో మోసాలు, ఆరోపణలపై సొంత టీంతో కాకుండా.. స్వతంత్ర విభాగాన్ని నియమించింది భారత్‌పే.  ఈ తరుణంలో ఆయన్ను గద్దె దించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అయితే..  

తాను కంపెనీని వీడాలంటే.. 4 వేల కోట్ల రూపాయలు తన ముందు పెట్టాలని ఆయన ఇన్వెస్టర్లను డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఓ బిజినెస్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన సంకేతాలు పంపించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ కొట్టిపారేసిన గ్రోవర్‌.. తనను ఇన్వెస్టర్లు గనుక బయటకు పంపాలనుకుంటే తన డిమాండ్‌లను నెరవేర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. 

భారత్‌పేలో గ్రోవర్‌కి 9.5 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఆయన సంపద విలువ 21‍ వేల కోట్ల రూపాయాలకు పైనే. ఇక భారత్‌పే కంపెనీ విలువ 6 బిలియన్‌ డాలర్లకు పైనే ఉంటుందన్నది ఒక అంచనా. ‘‘రాజీనామా చేసేంత తప్పు నేనేం చేశా?.  నేను ఈ కంపెనీ ఎండీని. కంపెనీని నడిపిస్తోంది నేనే. ఒకవేళ బోర్డు గనుక నా అవసరం లేదనుకుంటే.. నన్ను ఎండీగా కొనసాగించడం ఇష్టం లేదనుకుంటే.. నాకు రావాల్సిన 4 వేల కోట్ల రూపాయలను టేబుల్‌ మీద పెట్టి.. తాళాలు తీసుకోవచ్చు. ఒకటి కంపెనీని నేనే నడిపించడమా? లేదా నాకు సెటిల్‌ మెంట్‌ చేసి బయటకు పంపించడమా? అంతేతప్ప.. మూడో ఆప్షన్‌ బోర్డు దగ్గర లేదు అని స్పష్టం చేశాడాయన. 

మరోవైపు ఆయన న్యాయపోరాటానికి సైతం సిద్ధమయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న సుహాయిల్‌ సమీర్‌ను పదవి నుంచి తప్పించాలంటూ ఆయన డిమాండ్‌ చేస్తున్నాడు కూడా. ఇదిలా ఉంటే.. నైకా ఐపీవోకి సంబంధించిన పెట్టుబడుల విషయంలో కొటాక్‌ మహీంద్ర బ్యాంక్‌తో భారత్‌పే ఎండీ అష్నీర్‌ గ్రోవర్‌కి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బ్యాంకుకు లీగల్‌ నోటీసులు పంపిన కొద్దిరోజులకే.. కొటక్‌ ఎంప్లాయి ఒకరిని ఫోన్‌లో బండబూతులు తిట్టాడు అష్నీర్‌. అందుకు సంబంధించిన క్లిప్‌ ఒకటి బయటకు రాగా.. ఈ వ్యవహారానికి సంబంధించి కొటక్‌ బ్యాంకు లీగల్‌ నోటీసులు పంపింది భారత్‌పేకు. 

ఈ పరిణామాలతో అష్నీర్‌ గ్రోవర్‌ కొన్నాళ్లపాటు సెలవుల మీద బయటకు వెళ్లగా.. తాజాగా ఆయన సెలవులను మార్చి 31 వరకు పొడిగించింది భారత్‌పే. దీంతో ఆయన ఉద్వాసన ఖాయమని అంతా భావించగా.. అలాంటిదేం లేదని కంపెనీ ప్రకటన ఇచ్చింది.  ఆ కొద్దిరోజులకే ఆయన భార్య మాధురిని సైతం సెలవుల మీద పంపింది. ఈ గ్యాప్‌లో భారత్‌పే సీఈవో సుహాయిల్‌ సమీర్‌కు బాధ్యతలు అప్పజెప్పిన బోర్డు.. అష్నీర్‌ ఆయన భార్య మాధురి ఇద్దరూ ఫేక్‌ ఇన్‌వాయిస్‌లతో భారీ అవకతవకలకు పాల్పడ్డాడంటూ ఫోరెన్సిక్‌ అడిట్‌ కోసం అల్వరెజ్‌& మార్షల్‌, పీడబ్ల్యూసీలను నియమించి.. దాదాపుగా ఆయన ఉద్వాసనను ఖరారు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top