రక్తపుమడుగులో వ్యక్తి, చోద్యం చూస్తూ మనుషులు! ఎమర్జెన్సీ అలర్ట్‌తో కాపాడిన స్మార్ట్‌వాచ్‌

Apple Smart Watch Saves Singapore Man Life From Accident - Sakshi

Apple Smart Watch Saves Singapore Man's Life: ‘మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించవలసిన మనుషుల్ని వాడుకుంటున్నాడు’ ఓ ఫేమస్‌ సిన్మా డైలాగ్‌ ఇది.  కానీ, ఈ ఘటన చదివాక వస్తువులనే ప్రేమించడం బెటర్‌ ఏమో అనిపించకమానదేమో!. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే.. అటుపక్కగా వెళ్తున్న వాళ్లు ‘మనకెందుకు లే’ అనుకుంటూ వెళ్లిపోయారు. కానీ,  అతని చేతికున్న స్మార్ట్‌ వాచ్‌ మాత్రం విధిగా పని చేసి అతని ప్రాణాల్ని నిలబెట్టింది.  

సెప్టెంబర్‌ 25న సింగపూర్‌ అంగ్‌ మో కియో టౌన్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  మహముద్‌ ఫిట్రీ(24) అనే వ్యక్తి బైక్‌ మీద వెళ్తుండగా టౌన్‌లోని ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. సాయంత్రం ఏడున్నర గంటల టైంలో యాక్సిడెంట్‌ జరగ్గా.. జనాలు పక్కనుంచి చూస్తూ వెళ్లిపోయారే తప్ప సాయం అందించేందుకు ముందుకు రాలేదు. కనీసం ఆంబులెన్స్‌కు కాల్‌ చేయాలనే ప్రయత్నం కూడా చేయలేదు ఎవరూ(ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది). ఆ టైంలో అతని చేతికున్న వాచ్‌ అతని ప్రాణం కాపాడింది.

ఫిట్రీ చేతికి ఉంది ఓ స్మార్ట్‌వాచ్‌. ఇందులో స్పెషల్‌ ఫీచర్స్‌ ఏంటంటే.. కాల్స్‌కు, మెసేజ్‌లకు యూజర్‌ స్పందించకపోతే (కట్‌ చేయడం తప్పించి) ఆ వ్యక్తి ఆపదలోఉన్నట్లు గుర్తించి.. ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లో ఉన్న నెంబర్లను అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు ప్రమాదాలకు గురైనప్పుడు, ఏదైనా బలంగా ఢీకొట్టినప్పుడు.. స్మార్ట్‌ వాచ్‌ నుంచి ‘ఫాల్‌ అలర్ట్‌’ మోగుతుంది.  యూజర్‌ ఒకవేళ దానిని ఆఫ్‌ చేయకపోతే.. సదరు వ్యక్తి ఆపదలో ఉన్నట్లు నిర్ధారించుకుంటుంది ఆ వాచ్‌. తద్వారా అతని కాంటాక్ట్‌లో ఉన్న లిస్ట్‌కు కాల్స్‌, మెసేజ్‌లు పంపించి అప్రమత్తం చేస్తుంది.

 

ఫిట్రీకి ప్రమాదం జరిగిన 30 నిమిషాలకు స్మార్ట్‌ వాచ్‌లోని అలర్ట్‌ ద్వారా సమాచారం అందుకున్న సింగపూర్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రమాద స్థలానికి చేరుకుంది.  అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి చేర్చింది. టైంకి చికిత్స అందడంతో ఆ యువకుడి ప్రాణాలు నిలిచాయి. ఇదిలా ఉంటే యాపిల్‌ 4 సిరీస్‌ వాచ్‌ను ఫిట్రీకి అతని గర్ల్‌ఫ్రెండ్‌ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది జూన్‌లో నార్త్‌ కరోలినాకు చెందిన ఓ వృద్ధుడి ప్రాణాల్ని స్మార్ట్‌ వాచ్‌ నిలబెట్టిన సంగతి తెలిసిందే.

చదవండి: స్మార్ట్‌వాచ్‌ చెప్పేవరకు తెలీదు ఆమెకు గుండెపోటు వచ్చిందని!!

ఇదీ చదవండి: రన్నింగ్‌ కోచ్‌ జీవితాన్ని కాపాడిన స్మార్ట్‌వాచ్‌..! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top