ఐఫోన్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా! చైనా కంటే అధికంగా భారత్‌లో ఉత్పత్తి

apple iphone output in india triples - Sakshi

ప్రీమియం ఫోన్‌ల తయారీ సంస్థ యాపిల్‌ గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 7 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఐఫోన్‌లను అసెంబుల్ చేసింది. అంటే ఇది గతంలో కంటే మూడు రెట్లు అధికం. దీంతో స్మార్ట్‌ఫోన్ రంగంలో భారత్‌.. చైనా దాటి వేగంగా దూసుకెళ్తోంది.

(New GST Rule: జీఎస్టీ కొత్త రూల్‌.. మే 1 నుంచి అలా కుదరదు!)

ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ నుంచి పెగాట్రాన్‌ కార్ప్‌కి విస్తరించిన భాగస్వాముల ద్వారా యాపిల్‌ ఇప్పుడు దాదాపు 7 శాతం ఐఫోన్‌లను భారతదేశంలో తయారుచేస్తోంది. 2021లో 1 శాతం వాటాను కలిగి ఉన్న భారతదేశానికి ఇది గణనీయమైన పురోగతి.

వాషింగ్‌టన్‌, బీజింగ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాపై ఆధారపడటాన్ని యాపిల్‌ తగ్గించి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. గత సంవత్సరం జెంగ్‌జౌలోని ఫాక్స్‌కాన్  ప్రధాన “ఐఫోన్ సిటీ” కాంప్లెక్స్‌లో గందరగోళం కారణంగా యాపిల్‌ ఉత్పత్తి అంచనాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. మరోవైపు భారత ప్రభుత్వం తయారీ రంగాన్ని పెంపొందించడానికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో యాపిల్‌ చైనాను కాదని భారత్‌లో ఉత్పత్తిని పెంచింది.  ఇదే దూకుడు కొనసాగితే 2025 నాటికి మొత్తం ఐఫోన్‌ల ఉత్పత్తిలో నాలుగింట ఒక వంతు భారత్‌లోనే జరగనుంది.

తన సప్లయి చైన్‌ను  విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించిన యాపిల్‌ భారతదేశంలో ప్రోత్సాహకాల కోసం విజయవంతంగా లాబీయింగ్ చేసింది. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ కార్ప్,   పెగాట్రాన్‌ సంస్థలతో జత కట్టింది. ఈ మూడు కలిసి భారత్‌లో దాదాపు 60,000 మందికి ఉపాధి కల్పించాయి.  ఐఫోన్‌ 11 నుంచి తాజా ఐఫోన్‌ 14 వరకు మోడల్‌లను ఇక్కడ తయారు చేస్తున్నాయి. 

యాపిల్ తన మొదటి రెండు రిటైల్ స్టోర్లను వచ్చే వారం భారతదేశంలో ప్రారంభించనుంది. ఒకటి ఆర్థిక కేంద్రమైన ముంబైలో, మరొకటి దేశ రాజధాని న్యూఢిల్లీలో. యాపిల్‌ చీఫ్ టిమ్ కుక్ వీటిని ప్రారంభించేందుకు స్వయంగా వస్తారని తెలుస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top