ఎయిర్‌లైన్స్‌కు పూర్వ వైభ‌వం.. వచ్చే ఏడాది నుంచి లాభాలే లాభాలు

Airlines Get Profit In 2023 Said International Air Transport Association - Sakshi

జెనీవా: అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమ 2022 సంవత్సరానికి 6.9 బిలియన్‌ డాలర్లు (రూ.56,580 కోట్లు) నష్టాలను ప్రకటించొచ్చని.. వచ్చే ఏడాది నుంచి లాభాల బాటలో ప్రయాణిస్తుందని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) పేర్కొంది. ఎయిర్‌లైన్స్‌ సంస్థలు వ్యయ నియంత్రణకు తీసుకున్న చర్యలు, అధి ప్రయాణికుల రవాణా నష్టాలు తగ్గేందుకు అనుకూలిస్తాయని తెలిపింది. 

ఐఏటీఏ డైరెక్టర్‌ జనరల్‌ విల్లీ వాల్ష్‌ జెనీవాలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంతో పోలిస్తే భారత్‌ ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమ ఈ ఏడాది మంచి రికవరీని చూసినట్టు చెప్పారు. కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను, వాటి విడిభాగాలను పొందడమే సవాలుగా పేర్కొన్నారు. 

కరోనాతో కుదేలైన దేశీ ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమ ఈ ఏడాది మంచిగా కోలుకోవడం తెలిసిందే. ప్రయాణికుల డిమాండ్‌ బలంగా ఉండడంతో ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించే పనిలో ఉన్నాయి. అయితే, చైనాలోని లాక్‌డౌన్‌లు, జీరో కోవిడ్‌ పాలసీ, రవాణాపై ఆంక్షలు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో పరిశ్రమ రికవరీపై ప్రభావం పడేలా చేసినట్టు ఐఏటీఏ తన తాజా నివేదికలో తెలిపింది. 

వచ్చే ఏడాది లాభాలు.. 
2023లో అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమ లాభాల్లోకి అడుగు పెడుతుందని ఐఏటీఏ అంచనా వేసింది. 4.7 బిలియన్‌ డాలర్ల లాభాన్ని నమోదు చేయవచ్చని పేర్కొంది. ఈ ఏడాదికి 6.9 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని ఎదుర్కోవచ్చన్న ఈ నివేదిక.. 2020లో 138 బిలియన్‌ డాలర్లు, 2021లో 42 బిలియన్‌ డాలర్ల కంటే చాలా తగ్గినట్టేనని తెలిపింది. ఈ ఏడాది అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు 9.7 బిలియన్‌ డాలర్ల నష్టాలను ఎదుర్కోవచ్చని ఐఏటీఏ జూన్‌లో అంచనా వేయడం గమనార్హం.

ఈ ఏడాది ఒక్క నార్త్‌ అమెరికాలోనే ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమ లాభాలను కళ్ల చూసినట్టు తెలిపింది. 2023లో నార్త్‌ అమెరికాతోపాటు యూరప్, మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతాల్లోని సంస్థలు సైతం లాభాల్లోకి అడుగుపెడతాయని పేర్కొంది. ఇక ల్యాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఆసియా/పసిఫిక్‌ ప్రాంతాల్లోని సంస్థలు వచ్చే ఏడాదీ నికరంగా నష్టాలను చూస్తాయని అంచనా వేసింది. 2019లో నమోదైన ప్రయాణికుల రేటుతో పోలిస్తే ఈ ఏడాది 70 శాతంతో ముగించొచ్చని పేర్కొంది. ఈ ఏడాది అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్‌ సంస్థల ఆదాయం 727 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని, వచ్చే ఏడాది 779 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top