ఎయిరిండియాకు డ్రీమ్‌లైనర్‌ క్రాష్‌ సెగ | Air India Bookings Drop 20 Percent, Fares Cut Up To 15 Percents After Ahmedabad Plane Crash Incident, More Details | Sakshi
Sakshi News home page

ఎయిరిండియాకు డ్రీమ్‌లైనర్‌ క్రాష్‌ సెగ

Jun 21 2025 6:37 AM | Updated on Jun 21 2025 8:58 AM

Air India bookings drop 20 percent, fares cut up to 15 percents

20 శాతం పడిపోయిన బుకింగ్స్‌ 

15 శాతం వరకు తగ్గిపోయిన చార్జీలు

న్యూఢిల్లీ: గతవారం బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ విమానం కుప్పకూలిన నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా బుకింగ్స్, చార్జీలు పడిపోయాయి. దేశ, విదేశీ రూట్లలో బుకింగ్స్‌ 20 శాతం పడిపోగా, చార్జీలు సైతం సగటున 8–15 శాతం తగ్గాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జూన్‌ 12న 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కి బైల్దేరిన కాస్సేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఉదంతం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్‌ తగ్గడాన్ని గమనించామని ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్‌ (ఐఏటీవో) ప్రెసిడెంట్‌ రవి గోసాయి తెలిపారు. అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్‌ 18–22 శాతం, దేశీయంగా 10–12 శాతం మేర తగ్గినట్లు వివరించారు. అయితే, ఇదంతా తాత్కాలికమే కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక ఇండిగో, ఆకాశతో నేరుగా పోటీ ఉన్న దేశీ రూట్లలో ఎయిరిండియా టికెట్ల చార్జీలు 8–12 శాతం తగ్గినట్లు గోసాయి చెప్పారు. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూరప్, ఆగ్నేయాసియా రూట్లలో చార్జీలు 10–15 శాతం క్షీణించినట్లు వివరించారు.  

పలువురు ప్రయాణికులు ఎయిరిండియా ఫ్లయిట్స్‌లో ప్రయాణాలను రద్దు కూడా చేసుకున్నట్లు చెప్పారు. ప్రధానంగా కార్పొరేట్, హై–ఎండ్‌ లీజర్‌ ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమాన సంస్థలకు మళ్లినట్లు వివరించారు. గత వారం రోజులుగా అంతర్జాతీయ రూట్లలో క్యాన్సిలేషన్లు 15–18 శాతం, దేశీ రూట్లలో 8–10 శాతం స్థాయిలో ఉన్నట్లు గోసాయి చెప్పారు. అయితే, ఎయిరిండియా విమానాలు అంతర్జాతీయ భద్రత ప్రమాణాలను పాటిస్తున్నట్లుగా నియంత్రణ సంస్థలు ధృవీకరిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారొచ్చని వివరించారు. మరోవైపు, ఎయిరిండియా ఫ్లయిట్స్‌ బుకింగ్స్‌ 15–20 శాతం వరకు, చార్జీలు కొన్ని రూట్లలో 10 శాతం వరకు తగ్గినట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఇన్‌ ఇండియన్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ జనరల్‌ సెక్రటరీ రాజీవ్‌ మెహ్రా చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement