
ఇంజనీరింగ్ ఉత్పత్తులే తర్వాతి స్థానాల్లో అగ్రి, ఫార్మా, ఎలక్ట్రానిక్స్
50 శాతం వాటా ఈ రంగాలదే
గత కొన్నేళ్ల నుంచి వృద్ధి బాటలోనే
బియ్యం ఎగుమతులు 12.5 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మా, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు దేశ ఎగుమతుల్లో గణనీయమైన వాటా ఆక్రమిస్తున్నాయి. 2024–25లో నమోదైన మొత్తం ఎగుమతుల్లో ఈ రంగాల వాటాయే 50 శాతంగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా 26.67 శాతం వాటాతో ఇంజనీరింగ్ ఉత్పత్తులు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఆ తర్వాత 11.85 శాతం ఎగుమతులు వ్యవసాయ రంగం నుంచి నమోదవగా.. ఫార్మా 6.96 శాతం, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు 8.82 శాతం చొప్పున ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల్లో అత్యధికంగా ఎల్రక్టానిక్స్ నుంచి 32.46 శాతం మేర వృద్ధి నమోదైంది. 2023–24లో 29.12 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు జరగ్గా.. 2024–25లో 38.58 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2021–22లో ఇవే ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 15.7 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే మూడేళ్లలో 130 శాతం వరకు వృద్ధి చెందాయి. ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో కంప్యూటర్ హార్డ్‌వేర్, పెరిఫెరల్స్ వాటా 3.8 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో 101 శాతం పెరిగాయి. యూఏఈ, అమెరికా, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇటలీ భారత ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి.
ఇంజనీరింగ్ ఎగుమతులు 117 బిలియన్ డాలర్లు
ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 2023–24తో పోల్చి చూస్తే 2024–25లో 6.74 శాతం పెరిగి 117 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇంజనీరింగ్ ఎగుమతులకు అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, బ్రిటన్, జర్మనీ కీలక మార్కెట్లుగా ఉన్నాయి. 2014–15 నుంచి 2020–21 వరకు దేశ ఇంజనీరింగ్ ఎగుమతులు 73–83 బిలియన్ డాలర్ల మధ్య ఉండగా.. 2021–22లో 112 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అప్పటి నుంచి ఇవి ఏటా 100 బిలియన్ డాలర్లకు పైనే ఉంటున్నాయి. ఔషధాల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 9.4% పెరిగి 30.47 బిలియన్ డాలర్లకు చేరగా, వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులు 7.36% పెరిగి 52 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
200 దేశాలకు ఫార్మా ఎగుమతులు
భారత్ నుంచి 200 దేశాలకు ఔషధాల ఎగుమతులు జరుగుతున్నట్టు వాణిజ్య శాఖ డేటా తెలిజేస్తోంది. ముఖ్యంగా 2014–15 నుంచి ఫార్మా ఎగుమతులు ఏటేటా పెరుగుతూ వెళుతున్నాయి. వ్యవసాయ రంగం నుంచి మసాలా దినుసులు, కాఫీ, టీ, పొగాకు, బియ్యం, పండ్లు, కూరగాయాలు, సముద్ర ఉత్పత్తుల్లో సానుకూల వృద్ధి నమోదైంది. దినుసుల ఎగుమతులు 4.45 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చైనా, అమెరికా, యూఏఈ, బంగ్లాదేశ్, థాయిలాండ్ మసాలా దినుసులను ఎక్కువగా దిగుమతి చేసుకున్నాయి. మిరప, పసుపు, అల్లం, జీలకర్ర ఎగుమతులు ప్రధానంగా ఉన్నాయి.
కాఫీ ఎగుమతుల్లో మెరుగైన వృద్ధి
కాఫీ ఎగుమతులు 1.81 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2023–24లో కాఫీ ఎగుమతులు 1.29 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కాఫీ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. ఇటలీ, రష్యా, జర్మనీ, యూఏఈ, బెల్జియం, యూఎస్‌కు రొబుస్టా కాఫీ ఎక్కువగా ఎగుమతి అయింది. దేశీయంగా కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే, కేరళ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాలకు చెందిన కొన్ని రకాల కాఫీలకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఉండడం సానుకూలిస్తోంది. ఇక తేయాకు ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 0.92 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు తేయాకు తయారీలో 81 శాతం వాటా కలిగి ఉన్నాయి.
పొగాకు ఉత్పత్తులు 2 బిలియన్ డాలర్లు
2024–25 సంవత్సరం ఎగుమతుల్లో పొగాకు ఉత్పత్తులు 1.98 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2023–24లో నమోదైన 1.45 బిలియన్ డాలర్లతో పోల్చితే మెరుగైన వృద్ధి కనిపించింది. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తి పరంగా భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ప్రధానంగా యూఏఈ, బెల్జియం, ఇండోనేషియా, ఈజిప్ట్, యూఎస్‌ఏ, టరీ్కకి పొగాకు ఎగుమతులు జరుగుతున్నాయి. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, యూపీ, కర్ణాటక పొగాకు ఉత్పత్తిలో కీలక వాటా ఆక్రమిస్తుండగా, సుమారు 4.57 కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది.
జోరుగా బియ్యం ఎగుమతులు
గత ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఎగుమతులు రికార్డు స్థాయిలో 12.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2023–24లో ఇవి 10.4 బిలియన్ డాలర్లుకు చేరాయి. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా 40 శాతంగా ఉంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, యూఎస్‌ఏ, యేమెన్‌కు బియ్యం ఎగుమతులు అధికంగా జరిగాయి. ఆ తర్వాత కూరగాయల ఎగుమతులు 3.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ద్రాక్ష, దానిమ్మ, మామిడి, అరటి, టమాటా ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక సుమద్ర ఉత్పత్తుల ఎగుమతులు 7.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి.