తాలిబాన్‌ ఎఫెక్ట్‌.. ఎగుమతిదారుల్లో ఆందోళన

Afghanistan situation to impact trade with India - Sakshi

ఎగుమతిదారుల్లో ఆందోళన

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న  అనిశ్చితి కారణంగా ఆ దేశంతో భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్యంపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్‌ఐఈవో అభిప్రాయపడింది. అఫ్గానిస్తాన్‌లో రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని దేశీ ఎగుమతిదారులకు ఎఫ్‌ఐఈవో డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ సూచించారు. అఫ్గానిస్తాన్‌.. తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్లిపోవడం, పరిస్థితులు అదుపు తప్పడం వంటి పరిణామాల కారణంగా కొంత సమయం పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోవచ్చని ఎఫ్‌ఐఈవో వైస్‌ ప్రెసిడెంట్‌ ఖాలిద్‌ ఖాన్‌ తెలిపారు. అనిశ్చితి తొలగిపోయిన తర్వాతే తిరిగి లావాదేవీలు ప్రారంభం కావచ్చని వివరించారు.

అఫ్గానిస్తాన్‌కు భారత్‌ ఇస్తున్న ఆర్థిక సహాయం వల్ల దేశీ ఉత్పత్తులకు మార్కెట్‌ ఉంటోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇదంతా నిల్చిపోవచ్చని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బిస్వజిత్‌ ధర్‌ పేర్కొన్నారు. సకాలంలో చెల్లింపులు జరుగుతాయో లేదోనన్న సందేహాల వల్ల అఫ్గానిస్తాన్‌కు భారత్‌ నుంచి ఎగుమతులు పూర్తిగా నిల్చిపోవచ్చని సాయి ఇంటర్నేషనల్‌ సంస్థ చీఫ్‌ రాజీవ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2019–20 ఆర్థిక సంవత్సరంలో 1.52 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2020–21లో 1.4 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. భారత్‌ నుంచి ఎగుమతులు 826 మిలియన్‌ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 510 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top