అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లకు స్పందన అంతంతే

ఏసీసీ, అంబుజాకు రెస్పాన్స్ వీక్
న్యూఢిల్లీ: సిమెంట్ రంగ దిగ్గజాలు ఏసీసీ, అంబుజా వాటాదారులకు అదానీ గ్రూప్ ప్రకటించిన ఓపెన్ ఆఫర్లలో నామమాత్ర స్పందనే కనిపించింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్‌కు చెందిన దేశీ బిజినెస్ కొనుగోలులో భాగంగా అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లను చేపట్టింది. పబ్లిక్ నుంచి 26 శాతం అదనపు వాటా కొనుగోలుకి ప్రకటించిన ఓపెన్ ఆఫర్లు వారాంతాన(9న) ముగిశాయి.
సిమెంట్ దిగ్గజాలు వెల్లడించిన వివరా ల ప్రకారం 4.89 కోట్ల షేర్లకుగాను ఏసీసీ వాటాదారుల నుంచి 40.51 లక్షల షేర్లు మాత్రమే లభించాయి. ఇక అంబుజా సిమెంట్స్ విషయంలో మరింత తీసికట్టుగా కేవలం 6.97 లక్షల షేర్లు టెండర్ అయ్యాయి. కంపెనీ 51.63 కోట్ల షేర్ల కోసం ఆఫర్ ఇచ్చింది. రెండు కంపెనీల ఓపెన్ ఆఫర్లు ఆగస్ట్ 26న ప్రారంభమయ్యాయి. ఏసీసీ షేరుకి రూ. 2,300, అంబుజాకు రూ. 385 చొప్పున అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. హోల్సిమ్ దేశీ సిమెంట్ బిజినెస్‌ను సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ 10.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 84,000 కోట్లు)డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఓపెన్ ఆఫర్లు విజయవంతమైతే రూ.31,000కోట్లు వెచ్చించవలసి వచ్చేది.
వారాంతాన ఏసీసీ షేరు ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే బీఎస్‌ఈలో 3 శాతం అధికంగా రూ. 2,365 వద్ద ముగిసింది. అంబుజా సిమెంట్స్ ఆఫర్ ధరకంటే 18 శాతం ప్రీమియంతో రూ. 454 వద్ద స్థిరపడింది.
మరిన్ని వార్తలు