 
													అమెరికాలో లంచం, మోసం నేరారోపణలు
భారత్‌లో ప్రాజెక్టుల కోసం లంచాలిచ్చినట్లు అభియోగాలు
గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు
ఖండించిన అదానీ గ్రూప్
న్యూయార్క్/న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఉదంతం నుంచి కోలుకుని, క్రమంగా పుంజుకున్న అదానీ గ్రూప్‌నకు మళ్లీ షాక్ తగిలింది. భారత్‌లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు పొందేందుకు దాదాపు రూ. 2,200 కోట్లు (సుమారు 265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి.
వీరిలో ఆయన సోదరుడి కుమారుడు సాగర్ కూడా ఉన్నారు. అధిక ధరకు సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా రెండు రాష్ట్రాల అధికారులకు లంచాలిచ్చినట్లు, తద్వారా 20 ఏళ్ల పాటు 2 బిలియన్ డాలర్ల మేర లాభం పొందేందుకు అదానీ తదితరులు పథకం వేసినట్లు పిటిషన్‌లో అమెరికన్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. వివరాల్లోకి వెడితే .. స్థానికంగా తయారైన సోలార్ సెల్స్, మాడ్యులర్ ప్లాంట్లను ఉపయోగించి ఉత్పత్తి చేసిన 8 గిగావాట్ల సౌర విద్యుత్‌ను రెండు రాష్ట్రాలకు సరఫరా చేసే కాంట్రాక్టులను అదానీ గ్రూప్ 2021లో దక్కించుకుంది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశిత ధర అంచనాలను అందుకోలేకపోయినా, లంచాలను ఆఫర్ చేసి కాంట్రాక్టులను పొందిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదానీపై న్యూయార్క్ కోర్టులో అమెరికా న్యాయ శాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) రెండు కేసులు వేశాయి. మొదటి దానిలో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా ఏడుగురిపై న్యాయ శాఖ లంచం అభియోగాలు మోపింది. మరోవైపు, సెక్యూరిటీస్ చట్టాల్లో భాగమైన యాంటీ–ఫ్రాడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ గౌతమ్ అదానీ, సాగర్‌తో పాటు అజూర్ పవర్ మాజీ అధికార్ల మీద ఎస్‌ఈసీ ఆరోపణలు చేసింది.  
ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ) నుంచి 4 గిగావాట్ల ప్రాజెక్టును న్యూఢిల్లీ సంస్థ అజూర్ పవర్ దక్కించుకుంది. అయితే, అది లంచాల్లో తన వాటాను చెల్లించలేకపోవడంతో ఆ సంస్థ పొందిన కాంట్రాక్టులో కొంత భాగాన్ని ఎస్‌ఈసీఐ ద్వారా అదానీ గ్రూప్ దక్కించుకుంది. అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేయడంలో గతేడాది గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ భారీగా పతనమై, ఏకంగా 150 బిలియన్ డాలర్లు కరిగిపోయిన సంగతి తెలిసిందే.  
కెన్యా డీల్స్ రద్దు.. 
అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు అదానీ గ్రూప్‌పై ప్రభావం చూపుతున్నాయి. తమ దేశంలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్ల ఏర్పాటు కోసం అదానీ గ్రూప్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రుటో తెలిపారు. గ్రూప్ కంపెనీల తదుపరి రుణ సమీకరణలకు సంబంధించి తాజా పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని మూడీస్ 
రేటింగ్స్ తెలిపింది.
జరిగిందిక్కడ.. 
కేసు అక్కడ.. ఎందుకంటే.. 
2020–2024 మధ్యలో అదానీ గ్రూప్ అమెరికా డాలర్ మారకంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల నుంచి 2 బిలియన్ డాలర్లు సమీకరించింది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల గ్యారంటీతో బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే సెక్యూరిటీలను జారీ చేసింది. భారత్‌లో కాంట్రాక్టులను పొందేందుకు లంచాల విషయాన్ని వెల్లడించకుండా, అమెరికన్ ఇన్వెస్టర్లకు సెక్యూరిటీలను విక్రయించిందని తాజా కేసుల్లో ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అమెరికా చట్టాల ప్రకారం తమ దేశ ఇన్వెస్టర్లు లేదా మార్కెట్లతో సంబంధాలున్న విదేశీ సంస్థలపై అవినీతి ఆరోపణలేమైనా వస్తే విచారణ చేసే అధికారాలు అక్కడి న్యాయస్థానాలకు ఉంటాయి. 
దానికి అనుగుణంగానే అదానీ గ్రూప్‌పై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. అమెరికన్ ఇన్వెస్టర్లను అడ్డం పెట్టుకుని భారీ విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు అదానీ, ఇతర ప్రతివాదులు పథకం రచించినట్లు అటార్నీ బ్రియాన్ పీస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీ సహా అదానీ ఎనర్జీ అధికారులు సాగర్ అదానీ (ఈడీ), వినీత్ ఎస్ జైన్ (సీఈవో), అలాగే అజూర్ పవర్ గ్లోబల్ మాజీ అధికారులు సిరిల్ కబానెస్.. రంజిత్ గుప్తా.. రూపేష్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై( సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా) అభియోగాలు నమోదయ్యాయి.
Adani Group Spokesperson says, "The allegations made by the US Department of Justice and the US Securities and Exchange Commission against directors of Adani Green are baseless and denied. As stated by the US Department of Justice itself, "the charges in the indictment are… pic.twitter.com/rSuxuHTFUo
— ANI (@ANI) November 21, 2024
నిరాధార ఆరోపణలు...
తమపై వచ్చిన అభియోగాలను అదానీ గ్రూప్ ఖండించింది. ఇవన్నీ నిరాధారమైనవని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కేసుల విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ జారీ చేసిన 600 మిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూని ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది. అభియోగాలు వెల్లడి కావడానికి కొద్ది గంటల ముందే బాండ్ ఇష్యూ మూడు రెట్లు ఓవర్ సబ్ర్‌స్కయిబ్ కావడం గమనార్హం. అయినప్పటికీ తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అమెరిన్ డాలర్ల మారకంలోని బాండ్ ఇష్యూపై ముందుకెళ్లరాదని నిర్ణయించుకున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు అదానీ గ్రీన్ ఎనర్జీ తెలిపింది. మరోవైపు, ఈ వ్యవహారంలో తమ ప్రమేయమేమీ లేదని ఎస్‌ఈసీఐ సీఎండీ ఆర్‌పీ గుప్తా స్పష్టం చేశారు. అదానీ కేసుల్లో ఎక్కడా తమ సంస్థ ప్రస్తావన లేదని ఆయన పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
