2014 నుంచి 96 కొత్త సీపీఎస్‌ఈలు!

96 CPSEs incorporated since 2014 - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి కొత్తగా 96 కంపెనీ(సీపీఎస్‌ఈ)లను ఏర్పాటు చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం వీటిలో అత్యధికం ఢిల్లీ కేంద్రంగా ఆవిర్భవించాయి. 69 సీపీఎస్‌ఈల రిజిస్టర్డ్‌ కార్యాలయాలు ఢిల్లీలో నమోదయ్యాయి. జాబితాలో 2018లో ఏర్పాటైన ఎయిరిండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌(ఏఐఏహెచ్‌ఎల్‌) సైతం కలసి ఉంది.

విమానయాన దిగ్గజం ఎయిరిండియా ప్రయివేటైజేషన్‌లో భాగంగా కంపెనీకి చెందిన కీలకంకాని ఆస్తులు, లయబిలిటీలను విడదీసి ఏఐఏహెచ్‌ఎల్‌ పేరుతో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ బాటలో 2016లో సాగర్‌మాల డెవలప్‌మెంట్‌ కంపెనీ, 2018లో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ కార్పొరేషన్, 2020లో ఐటీపీవో సర్వీసెస్, ఇండియా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్, కంకార్‌ లాస్ట్‌ మైల్‌ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌లను సైతం నెలకొల్పింది. 

256 కంపెనీలు..  
2020లోనే ఎన్‌టీపీసీ రెనవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్, ఎన్‌ఎస్‌ఐసీ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్, రాజ్‌గఢ్‌ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌ ఆవిర్భవించినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడించాయి. మూడు సీపీఎస్‌ఈలు చొప్పున చత్తీస్‌గఢ్, యూపీలో నెలకొల్పగా.. జార్ఖండ్‌లో డియోఘఢ్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌సహా నాలుగు సంస్థలు రిజిస్టర్‌ అయ్యాయి. కర్ణాటకలో ఐదు, కేరళలో మూడు, మహారాష్ట్ర, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లలో రెండు, పంజాబ్, తెలంగాణలో ఒకటి చొప్పున కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2020 మార్చి31కల్లా 256 సీపీఎస్‌ఈలు మనుగడలో ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి. వీటిలో 171 లాభాలు ఆర్జిస్తుంటే, 84 నష్టాల్లో ఉన్నట్లు వెల్లడించాయి.  

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top