ఐటీలో నియామకాలకు 6 నెలలు బ్రేక్‌

6 months break for recruitment in IT Sector - Sakshi

హైరింగ్‌పై వేచి చూసే ధోరణిలో కంపెనీలు

అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులే కారణం

పరిశ్రమ వర్గాల అంచనా

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆరు నెలల పాటు హైరింగ్‌కు కాస్త విరామం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలను చూస్తే ప్రతి త్రైమాసికంలోనూ నికర నియామకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయని, రాబోయే రోజుల్లోనూ కొన్నాళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతక్రితం ఏడాది జోరుగా రిక్రూట్‌ చేసుకున్నప్పటికీ ప్రస్తుతం డిమాండ్‌ మాత్రమే కీలకాంశంగా మారిందని పేర్కొన్నాయి.

మూడో త్రైమాసికంలోనే నియామకాలు తక్కువ స్థాయిలో ఉండగా.. నాలుగో త్రైమాసికంలోనూ దాదాపు అదే రకమైన ట్రెండ్‌ నెలకొందని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ వర్గాలు వివరించాయి. చాలామటుకు కంపెనీలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయని పేర్కొన్నాయి. ఎక్స్‌ఫెనో జాబ్‌ రిపోర్ట్‌ ప్రకారం మార్చి త్రైమాసికంలో ఉద్యోగావకాశాలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 56 శాతం క్షీణించాయి. మరికొద్ది రోజుల్లో కంపెనీలు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించడం మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

బ్యాంకింగ్‌ కష్టాలు.
అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కూడా ఐటీ రంగంలో నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువగా బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలకు సేవలు అందించే దేశీ ఐటీ కంపెనీల్లో హైరింగ్‌ మందగించింది. ఈ పరిస్థితి నెమ్మదిగా మారనున్నప్పటికీ, కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలో మాత్రం ఆ ప్రభావాలు అలాగే కొనసాగవచ్చని ఎక్స్‌ఫెనో సహవ్యవస్థాపకుడు అనిల్‌ ఎథనూర్‌ పేర్కొన్నారు.

గత రెండు త్రైమాసికాలుగా హైరింగ్‌పై కాస్త సానుకూలంగా ఉన్నా, ఇంటర్వ్యూ చేసిన అభ్యర్ధులను తీసుకునే విషయంలో మాత్రం కంపెనీలు ముందుకు వెళ్లడం లేదని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ సీఈవో సునీల్‌ చెమ్మన్‌కొటిల్‌ తెలిపారు. ఆయా సంస్థలు వేచి, చూసే ధోరణి పాటిస్తున్నాయని, ఈ త్రైమాసికంలో నియామకాల పరిస్థితి ఆశావహంగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. తొలి ఆరు నెలల్లో నికరంగా నియామకాలు 40% తగ్గొచ్చని భావిస్తున్నట్లు వివరించారు.

బ్యాంకింగ్‌ సంక్షోభం కారణంగా క్యూ4లో కంపెనీల ప్రణాళికలు మారిపోయాయని, హైరింగ్‌పై దాని ప్రభావం పడిందని కెరియర్‌నెట్‌ సీఈవో అన్షుమన్‌ దాస్‌ చెప్పారు. వాస్తవానికి అంతక్రితం త్రైమాసికంలో ఐటీ కంపెనీలు హైరింగ్‌ను ప్రారంభించడంపై సానుకూల యోచనల్లోనే ఉన్నప్పటికీ .. బ్యాంకింగ్‌ సంక్షోభంతో పెద్దగా రిక్రూట్‌మెంట్‌ తలపెట్టలేదని వివరించారు. ఈ నేపథ్యంలో తొలి ఆరు నెలలు హైరింగ్‌ అంత ఆశావహంగా కనిపించడం లేదన్నారు. పరిస్థితులపై ఇంకా స్పష్టత రానందున కంపెనీలు వేచి చూసే ధోరణే కొనసాగించవచ్చని.. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కాస్త మెరుగ్గా ఉండవచ్చని దాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

2.5 లక్షలకు పరిమితం కావచ్చు..
దేశీ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, టెక్‌ మహీంద్రా క్యూ1లో 59,704, క్యూ2లో 34,713 మందిని రిక్రూట్‌ చేసుకోగా క్యూ3లో ఇది ఏకంగా 4,904కి పడిపోయింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బీపీవో సర్వీసుల విభాగంలో నికరంగా 4.80 లక్షల నియామకాలు జరగ్గా, 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.80 లక్షల స్థాయిలో ఉండొచ్చని హాన్‌ డిజిటల్‌ సీఈవో శరణ్‌ బాలసుందరమ్‌ తెలిపారు.

ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో నికర నియామకాలు సుమారు 2.5 లక్షల స్థాయిలో ఉండొచ్చని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్ని కంపెనీలు తాము ఇచ్చిన ఆఫర్లకు కట్టుబడి ఉండొచ్చని, మరికొన్ని వాటిని రద్దు చేసుకునే అవకాశం ఉందని బాలసుందరమ్‌ చెప్పారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హైరింగ్‌ అంతగా జరగకపోవడం, కోవిడ్‌ పరిస్థితులపరమైన డిమాండు కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో నియామకాలు భారీగా జరిగాయని ఆయన చెప్పారు. ఆ ఒక్క సంవత్సరాన్ని పక్కన పెడితే ఐటీలో ఏటా 2–3 లక్షల మంది హైరింగ్‌ సాధారణంగానే ఉంటుందని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top