మళ్లీ ఐటీలోకి వచ్చేది లేదు..

57percent IT pros in India wonot return to IT services sector - Sakshi

మెజారిటీ ప్రొఫెషనల్స్‌ అభిప్రాయం

టీమ్‌లీజ్‌ డిజిటల్‌ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరించే ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టే పెట్టుకోవడం ఐటీ రంగంలో చాలా కష్టంగా మారుతోంది. గత రెండేళ్లుగా ఇది మరింత తీవ్రమవుతోంది. ప్రొఫెష నల్స్‌లో చాలా మంది భవిష్యత్తులో ఈ రంగానికి తిరిగి రావద్దు అని భావిస్తుండటమే ఇందుకు కార ణం. ఐటీ రంగానికి నియామకాల సర్వీసులు అందించే టీమ్‌లీజ్‌ డిజిటల్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఉద్యోగుల అవసరాలు, ప్రాధాన్యతలు మారిపోయాయి.

వారు ఉద్యోగ నిబంధనల్లో సరళత్వం, కెరియర్‌లో వృద్ధి అవకాశాలు, ఉద్యోగులకు దక్కే ప్రయోజనాలు మొదలైన వాటి ఆధారంగా తమ కెరియర్‌లను మదింపు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో రెండంకెల స్థాయిలో 25 శాతం మేర అట్రిషన్‌ నమోదవుతోంది.  100 మంది పైగా నిపుణులు, ఐటీ రంగానికి సంబంధించిన వారితో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా టీమ్‌లీజ్‌ ఈ నివేదిక రూపొందించింది. ‘గత దశాబ్దకాలంలో దేశీ ఐటీ రంగం గణనీయంగా విస్తరించింది. అత్యంత వేగంగా 15.5 శాతం మేర వృద్ధితో 227 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరింది. 2022 ఆర్థిక సంవత్సరంలోనే అదనంగా 5.5 లక్షల ఉద్యోగాలను కల్పించింది‘ అని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ సీఈవో సునీల్‌ చెమ్మన్‌కోటిల్‌ తెలిపారు. 

మారుతున్న ట్రెండ్‌.. : అయితే, కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఐటీ నియామకాల ధోరణిలో పెను మార్పులు వచ్చా యి. వ్యాపారాలకు కీలకమైన ప్రతిభావంతులను అట్టే పెట్టుకోవడం ఐటీ కంపెనీలకు గత రెండేళ్లుగా కష్టంగా మారుతోంది. సర్వే ప్రకారం 57 శాతం మంది ప్రొఫెషనల్స్‌ భవిష్యత్తులో ఐటీ సర్వీసుల రంగానికి తిరిగి వచ్చే యోచన లేదని తెలిపారు. జీతాల పెంపు, ఇతర ప్రయోజనాలు ఎలాగూ ఉండేవే అయినా ఉద్యోగాలు మారడంలో కొత్త సంస్థల అంతర్గత విధానాలు కూడా ఉద్యోగులకు ఆకర్షణీయంగా ఉంటున్నాయని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో పని, వ్యక్తిగత జీవితం గురించి ఉద్యోగుల అభిప్రాయాల్లో వస్తున్న మార్పులను కూడా దృష్టి లో పెట్టుకుని కంపెనీలు తమ విధానాలను రూపొందించుకోవాల్సి ఉంటోందని తెలిపింది. ఉద్యోగులు, వారి అభ్యున్నతి లక్ష్యంగా కంపెనీల నియామక ప్రణళికలు వ్యూహాత్మకంగా ఉండాలని పేర్కొంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top