ఆర్టీసీ కార్మికుల కొవ్వొత్తుల ర్యాలీ
● మూడు రోజు కొనసాగిన ఆర్టీసీ సమ్మె ● బస్టాండ్లు, డిపోల వద్ద కార్మికుల ఆందోళన ● సమ్మెకు సీపీఐ, సీపీఎం, బీఆర్‌ఎస్ తదితర పార్టీల సంఘీభావం
చుంచుపల్లి: ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు శుక్రవారం ఆందోళనలతో హోరెత్తింది. నర్సంపేటలో కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో నిరసనలు ఉద్రిక్తంగా మారగా, పోలీసులు ఉదయం నుంచే డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మె విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రవాణా శాఖ మంత్రి కార్మికులను, సంస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు గురువారం జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో తాత్కాలిక సిబ్బందిని నియమించడంతో శుక్రవారం ఎక్కువ సంఖ్యలో బస్సులు రోడ్డెక్కాయి. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించారు. భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల పరిధిలో సగానికి పైగా బస్సులు వివిధ ప్రాంతాలకు అధికారులు తిప్పారు. అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దూరంగా ఉండి బస్సులను నడిపారు. కాగా, సమ్మెకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, మచ్చా వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా నాయకులు రంగాకిరణ్, విద్యాసాగర్, తెలంగాణ జాగృతి నాయకులు డి.వీరన్న తదితరులు సంఘీభావం తెలిపారు.
తెగించి పోరాడుదాం: ఎమ్మెల్యే కూనంనేని
ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని, తెగించి పోరాడి హక్కులను సాధించుకుందామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం బస్టాండ్ ఔట్ గేట్ వద్ద కార్మికులు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ తప్పిదమే, ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తోందని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సమ్మెకు ఆందోళనలో తెలిపినవారిలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, బీఆర్‌ఎస్ నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ ఎంపీపీ బదావత్ శాంతి, జేబీపీ పార్టీ నాయకులు ఝెర్రా కామేష్, గంధం మల్లికార్జున రావు తదితరులు ఉన్నారు.
నర్సంపేట కార్మికుడు శంకర్‌గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొత్తగూడెం ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు శుక్రవారం డిపో నుంచి బస్టాండ్ కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్ ఆత్మహత్య బాధాకరమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుల భాస్కర్‌రావు, నజీర్, అనిల్, బోసు, రాధమ్మ, మాధవి, సురేఖ, రేణుక, సింగ్, సబిత, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


