భద్రాచలం ఏఎస్పీకి సన్మానం | - | Sakshi
Sakshi News home page

భద్రాచలం ఏఎస్పీకి సన్మానం

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

భద్రాచలంఅర్బన్‌: మెదక్‌ ఏఎస్పీగా బదిలీపై వెళ్తున్న భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌ను గురువారం రాత్రి సన్మానించారు. రాజుల సత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఐటీడీఏ పీఓ రాహుల్‌, ఎస్పీ రోహిత్‌రాజు, భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్‌ ముఖ్యఅతిథులుగా హాజరుకాగా, జిల్లాలోని పలువురు పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గజమాలతో సన్మానం చేసి పుష్పగుచ్ఛాలు అందించారు. డీఎస్పీలు సతీష్‌, వంగా రవీందర్‌రెడ్డి, సీఐలు నాగరాజు, రాజువర్మ, వెంకటప్పయ్య ఎస్‌ఐలు, స్వప్న, సతీష్‌, శ్యాంప్రసాద్‌ పాల్గొన్నారు.

మొరాయించిన

‘మీ సేవ’ సర్వర్‌

కరకగూడెం: జిల్లా వ్యాప్తంగా మీ సేవ పోర్టల్‌ సర్వర్‌ శుక్రవారం ఒక్కసారిగా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో మీ సేవ కేంద్రాల వద్ద జనం బారులుదీరారు. క్షేత్రస్థాయిలో ఈఎస్‌డీ (ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ) సర్వర్‌ సమస్య తలెత్తడంతో కేంద్రాల నిర్వాహకులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. దీంతో వివిధ ప్రవేశ పరీక్షలు, విద్యాసంస్థల అడ్మిషన్ల దరఖాస్తులకు గడువు ముగుస్తుండటంతో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాంకేతిక లోపాలను సరిచేయాలని కోరారు.

మిషన్‌ భగీరథ

పైపులైన్‌ లీక్‌

ఇల్లెందు: పట్టణంలోని బుగ్గవాగు రైల్వే బ్రిడ్జి సమీపంలో శుక్రవారం మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకై ంది. భారీగా నీళ్లు ఎత్తి చిమ్మడంతో రోడ్డంతా జలమయంగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాకపోకలకు అంతరాయం కలిగింది.

వ్యాక్సిన్లు జాగ్రత్తగా భద్రపరచాలి

బూర్గంపాడు: ప్రభుత్వ ఆస్పత్రులలో వ్యాక్సి న్స్‌ను జాగ్రత్తగా భద్రపరచాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ ఆదేశించారు. మోరంపల్లిబంజర పీహెచ్‌సీని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. వ్యాక్సిన్‌ నిల్వలకు సంబంధించిన కోల్డ్‌చైన్‌ నిర్వహణ, వ్యాక్సిన్‌ ఫ్రీజింగ్‌ సదుపాయాలు, ఉష్ణోగ్రతల నిర్వహణ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లా మలేరియా నిర్మూలన అధికారి డాక్టర్‌ రాందాస్‌, డీపీఎంఓ మోహన్‌, సీహెచ్‌ఓ నాగభూషణం పాల్గొన్నారు.

లాటరీ పేరిట

రూ.1.50లక్షలకు టోకరా

కారేపల్లి: తక్కువ ధరలకే సబ్బులు ఇస్తాం.. సబ్బులు కొనుగోలు చేసిన వారు లక్కీ లాటరీలో రూ.లక్షలు గెలుచుకోవచ్చని ఓ వ్యక్తి మాయమాటలు చొప్పి రూ.1.50లక్షల మేర వసూలు చేసిన ఘటన మండలంలోని గాదెపాడులో వెలుగు చేసింది. ఏపీకి ఓ వ్యక్తి ఇటీవల గాదెపాడుకు రాగా, తక్కువ ధరతో నాణ్యమైన సబ్బులు విక్రయిస్తున్నట్లు నమ్మబలికాడు. అంతేకాక సబ్బులు కొన్న వారు లాటరీలో రూ.లక్షలు బహుమతిగా గెలుచుకోవచ్చని తెలిపాడు. దీంతో పలువురు సబ్బులు కొనుగోలు చేయగా ఫోన్‌నంబర్లు తీసుకుని వెళ్లిపోయాడు. ఆతర్వాత ఫోన్‌ చేసి లాటరీ తగిలిందని చెబుతూ రూ.20వేలు, రూ.30వేల చొప్పున ఫోన్‌పే ద్వారా డిపాజిట్‌ చేస్తే రూ.లక్ష ఖాతాలో జమ అవుతుందని చెప్పడంతో పలువురు రూ.1.50లక్షల మేర చెల్లించారు. కానీ డబ్బు జమ కాకపోగా, సదరు వ్యక్తి పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో మోసపోయామని గుర్తించారు. దీంతో గ్రామానికి చెందిన రాయల మాధవరావు తదితరులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.గోపి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement