పాల్వంచరూరల్: 66 ఏళ్ల క్రితం పెద్దమ్మతల్లిని ప్రతిష్ఠించినప్పుడు తీసిన చేదబావిని పూడ్చివేశారు. మండల పరిధి కేశవాపురం, జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారిని చింత చెట్టు కింద ప్రతిష్ఠించక ఏడాది మునుపే నాడు అటవీ ప్రాంతంలో తాగునీటి సౌకర్యార్థం 40 అడుగుల చేద బావిని తవ్వారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కల్గిన బావిని ఇటీవల ఎండోమెంట్ అధికారులు పూడ్చివేసి గోడలను మాత్రం నామమాత్రంగా ఉంచారు. పురాతన బావిని పూడ్చడం సరికాదని భక్తులు పేర్కొంటుండగా.. ఈ విషయమై ఆలయ ఈఓ ఎన్.రజనికుమారిని ఫోన్‌లో వివరణ కోరగా స్పందించలేదు.
ఏంటి తల్లీ ఈ నిర్లక్ష్యం..
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారి దర్శనం కోసం వెళ్లే క్యూలైన్ బారికేడ్ పైపు విరిగినా, స్వాగతం కన్య విగ్రహం రెక్క విరిగిన ఇటు ఈఓ గాని, అటు పాలకవర్గం గాని పట్టించుకోవడం లేదని భక్తులు వాపోతున్నారు. మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో బారికేడ్ పైపు విరిగి ప్రమాదకరంగా మారుతుంది. ఆలయం వెనక ఉన్న స్వాగత విగ్రహానికి ఒక రెక్క విరిగి పోయి రోజులవుతున్నా ఎవరూ పట్టించుకున్న నాథుడే లేరు. దీంతో ఏంటి తల్లి ఇంత నిర్లక్ష్యం అంటు భక్తులు వాపోతున్నారు.


