రాజుకుంటున్న ‘పంచాయితీ’ | - | Sakshi
Sakshi News home page

రాజుకుంటున్న ‘పంచాయితీ’

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

● ఐదు విలీన పంచాయతీల కోసం ఉద్యోగ సంఘాల పోరు ● తెలంగాణలో కలపాలని పార్లమెంట్‌లో లేవనెత్తిన ఎంపీలు

● ఐదు విలీన పంచాయతీల కోసం ఉద్యోగ సంఘాల పోరు ● తెలంగాణలో కలపాలని పార్లమెంట్‌లో లేవనెత్తిన ఎంపీలు

భద్రాచలం: అన్యాయంగా, ప్రజల మద్దతు లేకుండా రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలోకి రావాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఇప్పటికే ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించగా, జిల్లా మంత్రులు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఐటీడీఏ పీఓగా పనిచేసిన దివ్యా రాజన్‌ తెలంగాణలో కలిపితే ఆ గ్రామాల ప్రజలకు ఉపయోగకరమని ప్రభుత్వానికి నివేదిక కూడ అందజేశారు. తాజాగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాన్‌గెజిటెడ్‌, గెజిటెడ్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఐదు గ్రామపంచాయతీల కోసం మరో ఉద్యమాన్ని చేపడతామని పేర్కొంటున్నారు.

అసంబద్ధంగా రాష్ట్ర విభజన

రాష్ట్ర విభజనకు ముందు భద్రాచలం మండల పరిధిలో యటపాక, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు, కన్నాయిగూడెంలు ఉండేవి. భద్రాచలం పట్టణానికి మూడువైపులా సరిహద్దుల్లో ఈ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు పేరుతో ఆర్డినెన్స్‌ ద్వారా ఐదు పంచాయతీలను ఏపీలో కలిపారు. దీంతో భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న ప్రజలు నాటి నుంచి మనోవ్యధకు గురవుతూ దశాబ్దకాలంగా తిరిగి తెలంగాణలో కలపాలని వేడుకుంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో 2,161, పిచుకలపాడు పరిధిలో 2,187, గుండాల పరిధిలో 3,816, పురుషోత్నపట్నంలో 1,372, యటపాకలో 2,410తో మొత్తం 11,946 జనాభా ఉండగా, ప్రస్తుతం 25 వేలకు పైగా జనాభా ఉంటుందని అంచనా. భద్రాచలం పట్టణంలో నాడు 40 వేల జనాభా ఉండగా ఇప్పుడు సుమారు లక్ష వరకు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉద్యోగ జేఏసీ నేతృత్వంలో ఉద్యమం

ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. గురువారం భద్రాచలంలో నిర్వహించిన ఐక్య వేదిక సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతోపాటు రాష్ట్ర తెలంగాణ ఎంప్లాయీస్‌ సెక్రటరీ జనరల్‌, రాష్ట్ర గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ నెల 13న భద్రాచలంలోని భారీ సభ నిర్వహించనున్నారు. ధూంధాం సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉద్యోగ, ప్రజా, కుల సంఘాల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. దీంతో ఐదు పంచాయతీల వేడి రాజుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement