కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఆధ్వర్యంలో ఈనెల 11న నిర్వహించే మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకల ఏర్పాట్లపై గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయ జీఎం పర్సనల్ వెల్ఫేర్ – సీఎస్‌ఆర్ చాంబర్‌లో జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ – సీఎస్‌ఆర్ జీ.వీ.కిరణ్‌కుమార్ అధ్యక్షతన బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయంతి వేడుకలకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించి, హెచ్‌ఆర్‌డీ కాన్ఫరెన్స్ హాల్‌లో చేయబోయే ఏర్పాట్లను సివిల్, ఎలక్ట్రికల్, పర్సనల్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కలసి పరిశీలించారు. సింగరేణీయులందరూ పాల్గొని జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ లైజన్ ఆఫీసర్ వి.మురళి, బీసీ అసోసియేషన్ చీఫ్ లైసన్ హరిశంకర్‌రావు, ఎస్సీ లైజన్ ఆఫీసర్ డాక్టర్ మాలతి, డీజీఎం(పర్సనల్)లు కేసా నారాయణరావు, బి.శివకేశవరావు, బీసీ అసోసియేషన్ సభ్యుడు, డీజీఎం(ఈ–ఎం) ఎం.రాజశేఖర్ పాల్గొన్నారు.
భద్రాచలం ఎస్‌డీసీగా ఆనంద్‌కుమార్
భద్రాచలం: భద్రాచలం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్‌డీసీ – ట్రైబల్ వెల్ఫేర్)గా ఎన్.ఆనంద్‌కుమార్ నియమితులయ్యారు. రాష్ట్రంలో పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న ఆనంద్‌కుమార్‌ను భద్రాచలం ఎస్‌డీసీగా నియమించారు.
టేకులపల్లి కార్యదర్శి
సస్పెన్షన్
టేకులపల్లి: టేకులపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉప్పు దీప్తిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీలో ప్రొటోకాల్ పాటించడం లేదని సర్పంచ్ బోడ బాలు ఎంపీడీఓ, కలెక్టర్, డీపీఓలకు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ చేపట్టి నివేదిక తయారు చేశారు. ఈమేరకు కలెక్టర్ అంకిత్‌కు నివేదిక అందజేయగా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా డీపీఓ సుధీర్ ఆమెను సస్పెండ్ చేస్తూ మూడు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు.
బస్టాండ్‌లో
ఒడిశా వాసి మృతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లో ఒడిశాకు చెందిన అరవింద్(45) గురువారం మృతి చెందాడు. కొత్తగూడెం వన్‌టౌన్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్‌లో నిద్రపోయిన అరవింద్ అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీకి తరలించారు. మృతుడు బయ్యారం ఇటుకబట్టిలో పని చేస్తున్నాడని, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఒడిశా రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చెక్‌బౌన్స్ కేసులో
మహిళకు రిమాండ్
సూపర్‌బజార్(కొత్తగూడెం): చెక్‌బౌన్స్ కేసులో ఓ మహిళకు 14రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు. చుంచుపల్లి మండలం రాంనగర్‌కు చెందిన కె.రామకృష్ణారెడ్డి అదే ప్రాంతానికి చెందిన ఆలేటి అరుణపై 2022లో చెక్‌బౌన్స్ కేసు పెట్టారు. కేసు నడుస్తుండగా అరుణ తరచూ కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా, ఆమెకు 14రోజుల రిమాండ్ విధిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ మొదటిశ్రేణి న్యాయమూర్తి బి.రవికుమార్ తీర్పు చెప్పారు. దీంతో అరుణను భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.
భార్యాభర్తలు
ఆత్మహత్యాయత్నం
పాల్వంచరూరల్: కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు ఒకరి తర్వాత మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధి సత్యనారాయణపురం(మొండికట్ట) గ్రామానికి చెందిన మోగిత ప్రశాంత్, సరిత దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. ఈక్రమాన గురువారం భర్త, అత్తల మధ్య గొడవ జరగగా సరిత పురుగుమంది తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన భర్త కూడా పురుగుమందు తాగడంతో కుటుంబసభ్యులు అదే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.


