కారును ఢీకొట్టిన ఆటో | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొట్టిన ఆటో

Feb 1 2026 3:23 AM | Updated on Feb 1 2026 3:23 AM

కారున

కారును ఢీకొట్టిన ఆటో

యువకుడు మృతి.. ఐదుగురికి గాయాలు

పాల్వంచ: భద్రాచలం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు యువకులు పాల్వంచ మండలంలోని కోడిపుంజులవాగులోని బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం ఆటో మాట్లాడుకుని భద్రాచలం దైవ దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా పాల్వంచ రెజీనా కాన్వెంట్‌ సమీపంలో ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా స్పీడ్‌ తగ్గించాడు. వెనుక యువకులతో వస్తున్న ఆటో కారును ఢీకొట్టింది. ఆటోలోని యువకులు తీవ్రగాయాలపాలవ్వగా.. వారిని స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో మేడ్చెల్‌ జగద్గిరిగుట్టకు చెందిన రోహిత్‌ పటేల్‌ (21) మృతి చెందాడు. దుండిగల్‌కు చెందిన ఆకుల విష్ణు, గుగులోతు శ్రీనాఽథ్‌, జీడిమెట్లకు చెందిన రోషన్‌యాదవ్‌, జగద్గిరిగుట్టకు చెందిన కృష్ణ, దోమడుగు గుమ్మడాలకు చెందిన సాయి శంకర్‌, చింతాల రిషితేజతో పాటు ఆటోడ్రైవర్‌ శ్రీకాంత్‌కు గాయాలయ్యాయి. పోలీసులను వివరణ కోరగా ఇంకా ఫిర్యాదు రాలేదని, మృతుడి, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు హైదరాబాద్‌ నుంచి బయలుదేరారని తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

సుజాతనగర్‌: అక్రమంగా తరలిస్తున్న కలప వాహనాన్ని స్థానిక పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఎస్‌ఐ ఎం.రమాదేవి కథనం ప్రకారం.. సుజాతనగర్‌లో హెచ్‌పీ బంక్‌ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 3 టన్నుల చింత, వేప కర్రలతో వెళ్తున్న ఓ వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కలపను తరలిస్తున్న జూలూరుపాడు మండలం అనంతారం గ్రామానికి చెందిన ఈసం శేఖర్‌, తాటి జగదీశ్‌, ముక్తి రామరాజుతో పాటు డ్రైవర్‌ బానోత్‌ నరసింహను అదుపులోకి తీసుకొని నలుగురిపై కేసు నమోదు చేశామని, పట్టుబడిన కలపను అటవీ అధికారులకు అప్పగించామని ఎస్‌ఐ తెలిపారు.

ఐదు కేజీల గంజాయి స్వాధీనం

ఇద్దరు యువకుల అరెస్టు

కొత్తగూడెంఅర్బన్‌: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను శనివారం రాత్రి కొత్తగూడెం త్రీటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెంలోని ఎస్‌బీఐ వద్ద త్రీటౌన్‌ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఒడిశా నుంచి ఐదు కేజీల గంజాయితో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేశామని, పూర్తి వివరాలను ఆదివారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇసుక లారీ సీజ్‌

దమ్మపేట: ఏపీ నుంచి మండలానికి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పోలీసులు శనివారం సీజ్‌ చేశారు. ఎస్‌ సాయికిశోర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పట్వారిగూడెంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తుండగా అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న లారీని గుర్తించారు. సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా లారీని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, మైనింగ్‌ శాఖ అధికారులకు తెలపగా.. వారు రూ.లక్ష జరిమానా విధించారని తెలిపారు.

తాలిపేరు ఒడ్డున రహదారి ఏర్పాటుపై రగడ

చర్ల: మండలంలోని తేగడలో గల తాలిపేరు నది ఒడ్డున ఇసుక తరలింపు కోసం రోడ్డు గుండా ఇసుక లారీలను తరలిస్తుండగా శనివారం తేగడ గ్రామస్తులు అడ్డుకున్నారు. తాలిపేరు వాగు ఒడ్డును తవ్వి దాని వెంబడి రహదారిని ఏర్పాటు చేసి లారీలను తరలించడం వల్ల వరదలు వచ్చిన సందర్భంలో గ్రామం ముంపునకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇసుక లారీలను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు, ఇసుక క్వారీ నిర్వహిస్తున్న మహిళా సొసైటీ సభ్యులకు మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న చర్ల సీఐ రాజువర్మ ఇరు వర్గాలతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం వచ్చిన లారీలను ఆపకుండా పంపించి, ఇరు వర్గాల వారు కూర్చొని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించడంతో వారు శాంతించారు.

పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల అందజేత

ముదిగొండ: వివిధ కారణాలతో సెల్‌ఫోన్‌లు పోగొట్టుకున్న వారు ఇటీవల ముదిగొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం సీఐ మురళి ఆదేశాలతో సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా కనిపెట్టి ఐదుగురు బాధితులకు సెల్‌ఫోన్లను అందజేశారు. వాటి విలువ రూ.90 వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రసాద్‌, ఏఎస్‌ఐ శ్రీనివాస్‌, హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కారును ఢీకొట్టిన ఆటో 1
1/1

కారును ఢీకొట్టిన ఆటో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement