కాపర్ తీగ దొంగల అరెస్టు
దమ్మపేట: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్ తీగ చోరీకి పాల్పడిన వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. మండలంలోని అచ్యుతాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్నారు. అశ్వారావుపేట వైపునకు వేగంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా డిక్కీలో కాపర్ తీగను గుర్తించి, కారులోని ఏపీలోని కాకినాడ జిల్లాకు చెందిన పల్లా లోవరాజు (33), సుధీర్ (19), కొవ్వూరుకు చెందిన సారిక సురేశ్ (28) ముగ్గురు వ్యక్తులను ఆదుపులోకి తీసుకుని విచారించారు. ఇటీవల దమ్మపేట శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి, అందులోని సుమారు 90 కిలోల బరువు గల కాపర్‌వైర్‌ను బయటకు తీసి, సమీపంలోని చెట్ల పొదల్లో వేసి పరారయ్యారు. శనివారం ఉదయం ఆ తీగను కారు డిక్కీలో పెట్టుకుని, రాజమండ్రిలో విక్రయించడానికి వెళ్తున్నామని అంగీకరించారు. కాగా, వీరు గతంలో తాపీ పని చేసేవారని.. దురలవాట్లు, విలాసాల కోసం ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్‌వైర్‌ను తీసే విధానం నేర్చుకున్నారని, ఏపీలోని కొత్తవెంకటనగరం, నల్లజర్ల, కొవ్వూరు, గోపాలపురం, చాగల్లు, అన్నవరం, రాజానగరం, దేవరపల్లి ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ తీగను చోరీ చేశారని, 2024లో 18 కేసుల్లో అరెస్టు అయి, 2025లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారని డీఎస్పీ వెల్లడించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, కరకగూడెం, ములకలపల్లి, ఏడూళ్లబయ్యారం మండలాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్ తీగను చోరీ చేశారన్నారు. వారి వద్ద నుంచి చోరీకి ఉపయోగిస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వివరించారు. కాగా, కేసు ఛేదించిన సీఐ నాగరాజురెడ్డి, ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. లక్ష్మణ్, రామకృష్ణ, కాలేషావలీ, రమేశ్, నాగముత్యం తదితరులు ఉన్నారు.


