సాంస్కృతిక వైభవం.. బొగ్గుట్ట
మైసూర్‌ను మరిపిస్తూ దసరా ఉత్సవాలు
మార్గదర్శకంగా గణనాథుని వేడుకలు
భిన్నమతాల ఆరాధ్య వేడుక
నాగుల్‌మీరా ఉర్సు
సామరస్య స్ఫూర్తికి ప్రతీకగా..
ఇల్లెందురూరల్: పరిశ్రమల కేంద్రమంటే పాల్వంచ, మణుగూరు, ఆధ్యాత్మిక వైభోగం చూడాలంటే భద్రాచలం వెళ్లాల్సిందే. అలాగే జిల్లా సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకోవాలంటే ఇల్లెందును పరికించాల్సిందే.. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఇల్లెందు జిల్లాలో సాంస్కృతిక వారసత్వానికి చిరునామాగా.. మైలురాయిగా నిలుస్తోంది.
మినీ మేడారం..
వనదేవతలు కొలువుదీరిన ప్రాంతం మేడారం. అమ్మవార్ల శక్తి అక్కడే ఆవహించి ఉంటుందన్న విశ్వాసంతో భక్తులు ప్రతి రెండేళ్లకోమారు జాతరకు వెళ్లి పూజ చేసి మొక్కులు చెల్లించుకుంటారు. కానీ, ఇల్లెందు మండలంలోని బొజ్జాయిగూడెం అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన వనదేవతలకు ఆరు దశాబ్దాల కిందట స్థానిక ఆదివాసీలు గద్దెలు నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. మేడారంతో పాటుగా వనదేవతల శక్తి బొజ్జాయిగూడెంలోనే ఆవహించిందన్న నమ్మకంతో క్రమంగా భక్తుల తాకిడి పెరుగుతూ వచ్చింది. నేడు బొజ్జాయిగూడం వనదేవతల మహాజాతరకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
భజన బృందాలకు అంకురార్పణ
బొగ్గు వెలికితీత జరిగిన తొలినాళ్లలో కార్మికులు దట్టమైన అడవిలో బొగ్గు బావుల వద్దే నివాసం ఉండేవారు. క్రూర మృగాల బారి నుంచి రక్షణ, మానసికోల్లాసం రాత్రి వేళలో దేవుడిని స్మరించుకుంటూ వారు ఆలపించిన కీర్తనలు వారిలో కొత్త ఆలోచనకు ఆజ్యం పోశాయి. ఈ క్రమంలోనే తొలిసారిగా నంబర్–2 బస్తీలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో శ్రీకృష్ణ భజన బృందం ఏర్పాటైంది. రాత్రి వేళలో వారంతా భగవంతుడిని స్మరిస్తూ భజన చేయడం ప్రారంభించారు. వారి స్తూర్తితో ఇతర కార్మిక వాడల్లోనూ హనుమాన్, శ్రీరామ పేరుతో భజన బృందాలు ఏర్పడ్డాయి. ఇవి సంస్థతోపాటే సింగరేణివ్యాప్తంగా విస్తరించాయి.
వైభవంగా దసరా ఉత్సవాలు
దసరా ఉత్సవాలంటే ఉమ్మడి జిల్లావాసులకు గుర్తుకొచ్చేది ఇల్లెందు. కర్ణాటకలోని మైసూర్ తరహాలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. నాడు బ్రిటీష్ పాలకులు విడిది చేసే ప్రాంతంలోనే జమ్మి చెట్టు ఉండేది. కార్మిక వాడల్లోని భజన బృందాల నేతృత్వంలో దేవతల ప్రతిమలను కావడిలో మోస్తూ జమ్మి మైదానానికి తీసుకొచ్చేవారు. అక్కడ సామూహిక భజనతో జమ్మి పూజ ఘనంగా నిర్వహించేవారు. ఇలా వేడుకను వందేళ్లకుపైగా కావడి, రథాల సహాయంతో చేపట్టారు. నేడు నూతన హంగులతో ఆధునికతను మేళవించి సరికొత్తగా కొనసాగిస్తున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇల్లెందుకు వస్తుంటారు.
గణనాథునికి ఘన స్వాగతం
ప్రతీ చోట వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. కానీ, ఆ ఉత్సవాలను భిన్నంగా, హంగు ఆర్భాటాలతో నిర్వహించడం బొగ్గుట్ట ప్రత్యేకత. నాలుగు దశాబ్దాల కిందట ప్రత్యేకంగా కమిటీలు ఏర్పడి పోటీపోటీగా భారీ సెట్టింగులతో వినాయకచవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించేవారు. ఇల్లెందులోని పలు ప్రాంతాల్లో భారీ సెట్టింగులతో కూడిన మండపాలను తిలకించేందుకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చేవారు. ప్రత్యేక ఏర్పాట్లు, పూజలు చేసి గణనాథులను సాగనంపడం నేటికీ ఆనవాయితీగా వస్తోంది.
మేడారం తరహాలో
వనదేవతల జాతర
నమ్మిన భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా.. మత సామరస్యానికి ప్రతీకగా మండలంలోని హజరత్ నాగుల్‌మీరా దర్గాహ్ మౌలా చాన్ చిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఏటా ఇక్కడ నిర్వహించే ఉర్సు ఉత్సవాల వైభవంతో దర్గా పేరు దశదిశలా విస్తరించింది. ఒకప్పుడు గ్రామస్థాయి ఉత్సవంగా మొదలైన వేడుకలు ఇప్పుడు రాష్ట్రస్థాయికి చేరుకున్నాయి. ఆలయాలు, గుడులు, మసీదులు, దర్గాలు ఇలా మతపరమైన ప్రార్థనా స్థలాలంటే కోరికలు తీర్చే కేంద్రాలు, మహిమలు చూపే మందిరాలు మాత్రమే కాదని రకరకాల ఒత్తిడులతో చిత్తవుతున్న నేటి తరం మనుషులకు ప్రశాంతతను అందించే ప్రదేశమనే విధంగా నాగుల్‌మీరా దర్గా పేరు తెచ్చుకుంటోంది.


