
‘సీతారామ’ మట్టి మాయం!
ఫిర్యాదు చేశాం
● టిప్పర్ లారీలతో అర్ధరాత్రి తరలింపు ● వందలాది ట్రిప్పుల కాలువ మట్టి స్వాహా
ములకలపల్లి : మండల పరిధిలోని సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ) ప్రధాన కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. జేసీబీలతో టిప్పర్ లారీల్లో నింపి ఇతర ప్రాంతాలకు తోలి విక్రయిస్తున్నారు. పూసుగూడెం, మాధారం మధ్య అటవీ ప్రాంతంలోని మెయిన్ కెనాల్ సమీపం నుంచి యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. జనసంచారం లేని ప్రాంతం కావడంతో అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా మట్టి తరలించుకుపోతున్నారు. గత కొన్ని నెలులగా ఈ దందా సాగుతుండగా, ఇప్పటికే వందల కొద్దీ టిప్పుల మట్టి పాల్వంచతోపాటు పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో 12 అడుగులకు పైగా ఎత్తుగా పోసిన కాలువ మట్టి తరలిపోతోంది. సుమారు ఐదు వందల టిప్పర్ లారీలకు పైగా మట్టి బయటకు తరలించినట్లు సమాచారం. ఒక్కో టిప్పర్ రూ.5 వేలకు విక్రయించినా రూ.25 లక్షల విలువైన మట్టి తరలించినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల సహకారంతోనే ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
టిప్పర్ సీజ్, జరిమానా విధింపు
కొన్ని నెలలుగా దందా సాగుతున్న క్రమంలో పోలీసులు ఇటీవల ఓ లారీని సీజ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో రాత్రి వేళ సాగుతున్న మట్టి తోలకాల విషయం బయటకు పొక్కింది. సదరు మట్టి టిప్పర్ లారీని పోలీసులు, రెవెన్యూ శాఖకు అప్పగించారు. రూ.5 వేలు జరిమానా విధించినట్లు తహసీల్దార్ భూక్యా గనియా తెలిపారు.
మట్టి తోలకాల విషయంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. అక్రమ తోలకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మట్టి అక్రమ రవాణాను నిలువరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాం.
–రాంబాబు, డీఈ, నీటి పారుదల శాఖ

‘సీతారామ’ మట్టి మాయం!