
ముస్లిం దంపతుల మత సామరస్యం
అశ్వారావుపేటరూరల్: ముస్లిం దంపతులు భవానీ మాలధారులకు భిక్ష(అన్నదానం) చేసి మత సామరస్యం చాటారు. మండలంలోని ఆసుపాక గ్రామానికి చెందిన ఎస్‌కే కరీం–గౌసియా దంపతులు గురువారం తమ గ్రామంలో భవాని మాలధరించిన స్వాములకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ముస్లిం దంపతులు మాట్లాడుతూ కుల మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని, ఎంతో కఠోర దీక్ష చేసే భవాని మాలదారులకు అన్నదానం చేసే అదృష్టం తమ దక్కడం సంతోకరమని అన్నారు.
పీడీఎస్‌యూ
జిల్లా కమిటీ ఎన్నిక
సింగరేణి(కొత్తగూడెం): సెప్టెంబర్ 16,17 తేదీల్లో కొత్తగూడెంలోని ఉర్దూఘర్ ఫంక్షన్ హాల్‌లో పీడీఎస్‌యూ జిల్లా మహాసభలు జరిగాయి. మొదటి రోజు పట్టణంలో విద్యార్థుల ప్రదర్శన, రెండో రోజు ప్రతిఽనిధుల సభ నిర్వహించారు. నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోగా, గురువారం వివరాలు వెల్లడించారు. అధ్యక్షుడిగా వి.విజయ్, జిల్లా ఉపాధ్యక్షులుగా రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జే.గణేష్‌లతోపాటు మరికొందరిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
సింగరేణి మహిళా కళాశాల లెక్చరర్‌కు డాక్టరేట్
సూపర్‌బజార్(కొత్తగూడెం): సింగరేణి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఇంగ్లిష్ విభాగం హెచ్‌ఓడీగా పనిచేస్తున్న జి.మంజులకు ఏపీలోని నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆంగ్లంలో పరిశోధన చేసినందుకు ఆమెకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా సింగరేణి జీఎం ఎడ్యుకేషన్ ఎస్.వెంకటాచారి, కరస్పాండెంట్ జీకే కిరణ్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ శారద, కళాశాల లెక్చరర్లు అభినందనలు తెలిపారు.
నర్సరీలోని
మొక్కలు ధ్వంసం!
దుమ్ముగూడెం : మండలంలోని పెద్దబండిరేవు గ్రామంలోని అటవీశాఖ నర్సరీలోని దాదాపు 2 లక్షల మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు సమాచారం. నర్సరీలోని మొక్కలపై దుండగులు పురుగు మందు స్ప్రే చేయడంతో మొక్కలు మాడిపోయినట్లు తెలిసింది. రేంజర్ కమల సిబ్బందితో కలిసి గురువారం పరిశీలించారు.
22న ఫుట్‌బాల్ జట్టు
ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 ఫుట్‌బాల్ బాలుర జట్టును ఈనెల 22న ఎంపిక చేయనున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.మూసాకలీం తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరిగే పోటీలకు క్రీడాకారులు వయసు ధ్రువపత్రాలతో పాటు ఇంటర్ స్టడీ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని చెప్పారు. ఇక్కడ ఎంపిక చేసే జిల్లా జట్టు రాష్ట్రస్థాయి అండర్–19 జూనియర్ కళాశాలల పోటీల్లో పాల్గొంటుందని, వివరాలకు 99896 47696, 98483 41238 నంబర్లలో సూచించారు.
పద్ధతి మార్చుకోకుంటే
శిక్ష తప్పదు
చర్ల: కాంట్రాక్టర్లు, వ్యాపారులు, భూస్వాములు, రాజకీయ నాయకులతో పాటు ఓ విలేకరి పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతా రామరాజు జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి విప్లవ పేరిట గురువారం రాత్రి లేఖ విడుదలైంది. విప్లవోద్యమంపై పాలకుల, భూస్వా మ్య, పెత్తందారుల విధానాలు మళ్లీ పెచ్చరిల్లుతున్నాయని, పేద, మధ్య తరగతి వర్గాలపై దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కొందరు పెత్తందారులు ఈ పోకడలకు పాల్పడుతున్నారని, ముఖ్యంగా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో రాజకీయ బ్రోకర్లతో కలిసి పెత్తందారులు, భూస్వాములు ఈ పైశాచిక చర్యలకు పాల్పడుతున్నట్లు తమదృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. భూస్వాములు వారి భూములను పేదలకు పంచాలని, లేదంటే తామే స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని ప్రకటించారు. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, భూస్వాములు, కాంట్రాక్టర్లు పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, ఓ విలేకరి(సాక్షి కాదు) కూడా ఇలాంటి వైఖరే ప్రదర్శిస్తున్నాడని, వారు పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.

ముస్లిం దంపతుల మత సామరస్యం

ముస్లిం దంపతుల మత సామరస్యం