
విద్యావసతుల విస్తరణకు కృషి
సూపర్‌బజార్(కొత్తగూడెం): విద్యా వసతుల విస్తరణకు నిరంతరం కృషి చేస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలోని రామవరం ఏరియా బాలికల గురుకుల పాఠశాలలో రూ.5 కోట్ల ఐటీడీఏ నిధులతో చేపట్టనున్న వసతిగృహాల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువ మంది గిరిజన, గిరిజనేతర పేద విద్యార్థులు గ్రామీణ వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారని, వీరిని మరింత ప్రోత్సహించి ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, పరిష్కారానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, ప్రిన్సిపాల్ శిరీష, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య తదితరులు పాల్గొన్నారు.