రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందే అవకాశం
అవగాహన కల్పించని అధికారులు
కార్యాలయాల్లోనే మూలుగుతున్న
వ్యవసాయ యంత్రాలు
ఉచితంగా వాడుకోవచ్చు
ఇల్లెందు: మద్దతు ధర పొందాలంటే నిబంధనల ప్రకారం పంట ఉత్పత్తుల్లో వ్యర్థాలు ఉండకూడదు. తేమ నిర్దేశిత శాతానికి మించొద్దు. అప్పుడే రైతులు తాము పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందారు. పంటల్లో వ్యర్థాల తొలగింపునకు, ఉత్పత్తులను ఆరబెట్టేందుకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవగాహన లేకపోవడంతో రైతులు ఉపయోగించుకోవడంలేదు. దీంతో రూ. కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు కార్యాలయాల్లో, గోదాంలలో మూలుగుతున్నాయి.
5.92 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో 5,92,264 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. 1,39,169 మంది రైతులు ఉన్నారు. వరి 42 వేల ఎకరాలు, పత్తి 2.11 లక్షలు ఎకరాలు, మొక్కజొన్న 84 వేల ఎకరాలు, పెసర 346 ఎకరాలు, కంది 1,071 ఎకరాలతోపాటు మరికొన్ని పంటలను రైతులు సాగు చేస్తున్నారు. పంటల కొనుగోలు సమయంలో వ్యాపారులు, అధికారులు ఆయా పంటలను పరిశీలించి యంత్రాలతో నాణ్యతను పరిశీలించి ధర నిర్ణయిస్తుంటారు. అందుకు తగ్గట్లు పరిశుభ్రత పాటించకపోతే మద్దతు ధర లభించదు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. నష్టం వాటిల్ల కుండా ఉండేందుకు ఆయా మార్కెట్ యార్డుల్లో ధాన్యం నాణ్యత నిర్ధారణ యంత్రాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కువ మంది రైతులు వీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. తద్వారా ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర పొందలేకపోతున్నారు. ఇందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలేదు.
అందుబాటులో ఉన్న యంత్రాలు
ధాన్యానికి సంబంధించి నూర్పిడి యంత్రం, తాలు లేకుండా చేసేందుకు జల్లెడ, ప్యాడీ క్లీనర్, తూర్పార యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంటే డ్రయ్యర్ అనే యంత్రంతో ఆరబెట్టవచ్చు. ఇల్లెందు వ్యవపాయ మార్కెట్‌లో ప్యాడీ క్లీనర్ యంత్రాలు 60, ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్స్ రెండు, పెద్ద ప్యాడీ క్లీనర్ యంత్రాలు 13, ఒక డ్రయ్యర్ ఉన్నాయి. టార్పాలిన్‌లు 1900, ఎలక్ట్రానిక్ తూకం కాంటాలు 157, తేమ శాతం తేల్చే మిషన్లు 83, క్యాలీబర్స్ 54, టస్క్ రిమూవర్స్ 57 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్రాలను రైతులకు ఉచితంగా అందజేస్తారు. కాగా జిల్లాలో 43 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీలు వీటిని నిర్వహిస్తాయి.
పంట ఉత్పత్తుల్లో నిర్దేశిత
నాణ్యతా ప్రమాణాలు
మార్కెట్ యార్డుల్లో పంటల పరిశుభ్రతకు ఉపయోగించుకోవాల్సిన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పంట ఉత్పత్తుల్లో నాణ్యత పెంచుకుంటే మద్దతు ధర పొందవచ్చు. యంత్రాలను రైతులకు ఉచితంగానే అందజేస్తాం.
–ఈ.నరేష్, మార్కెట్ కార్యదర్శి, ఇల్లెందు
యంత్రాలు వినియోగించుకుంటే..
యంత్రాలు వినియోగించుకుంటే..