
కారు, బైక్ ఢీ
● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
పినపాక: ద్విచక్ర వాహనం, కారు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డ ఘటన మండలంలోని ఐలాపురం వద్ద గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మణుగూరు మండలం సమితిసింగారం గ్రామానికి చెందిన పాల్వంచ మహేష్ (32) మేనకోడలు అంజలితో కలిసి ద్విచక్రవాహనంపై గడ్డంపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న తన కూతురు వద్దకు వెళ్లాడు. కూతురిని చూసి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ప్రధాన రహదారిపై జానంపేట నుంచి వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 ద్వారా మణుగూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే మహేష్ మృతి చెందాడని తెలిపారు. అంజలి చికిత్స పొందుతోంది. కాగా కారు బైక్ ఢీకొన్నాక రోడ్డు దిగి చెట్లలోకి దూసుకెళ్లింది. కారు డ్రైవర్ అంజయ్యను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామని ఎస్సై సురేష్ తెలిపారు.