
కలల ప్రపంచం!
ఎకరంలో 29 ప్లాట్లు..
పైసాపైసా కూడబెట్టి కొన్నాం
రెక్కలు ముక్కలు చేసుకుని
కార్పొరేషన్ పేరుతో
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు పాల్పడేవారు మళ్లీ రెక్కలు విప్పుతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ సామాన్యుల కష్టార్జితాన్ని కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. వీరి ఆగడాలకు ఆరంభంలోనే అడ్డుకట్ట వేయకుంటే జిల్లా ఆవిర్భావం సమయంలో జరిగిన మోసాలే పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా సమీకృత కార్యాలయం ఎదురుగా 2017లో వెంచర్‌లో స్థలాలు కొనుగోలు చేసిన పలువురికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించాలని, తమలా మరొకరకు మోసపోకుండా చూడాలని గత నాలుగైదేళ్లుగా కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌లో బాధితులు పలుమారు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు లేడు.
ఎనిమిదేళ్లుగా తేలని పంచాయితీ..
అనధికారిక వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన ఇళ్లు నిర్మించేందుకు ప్రయత్నించగా ఇవి తమ ప్లాట్లని, తాము ఫలానా వ్యక్తుల నుంచి కొనుగోలు చేశామని వేరే వ్యక్తులు రంగంలోకి దిగారు. ఈ విషయమై పాల్వంచ పోలీస్‌స్టేషన్, ఎస్పీ ఆఫీస్, కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌లో బాధితులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎనిమిదేళ్లుగా ఎటూ తేలడం లేదు. స్థానిక దాదాలు రంగంలోకి దిగినా గొడవలు, రక్తపాతాలు మినహా ఒరిగిందేమీ లేదు. అనధికారిక వెంచర్ వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భారీ కమీషన్లు తీసుకుని అమాయకులకు ప్లాట్లు అంటగట్టిన బ్రోకర్లు తమను మోసం చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.
నిస్తేజంగా కార్పొరేషన్..
కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను ఏకం చేస్తూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటైంది. ఈ మేరకు కొత్తగూడెం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు జీఓ వచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. మరోవైపు పాల్వంచ మొదలు సుజాతనగర్ వరకు ఎక్కడిక్కడ వెంచర్లు వెలుస్తూనే ఉన్నాయి. వీటికి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ పేరుతో కలల ప్రపంచం చూపిస్తూ అనధికారిక వెంచర్లు పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్నా బల్దియా నుంచి కనీస అప్రమత్తత కనిపించడం లేదు.
జిల్లా ఏర్పాటు తర్వాత ప్రస్తుత పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 416/1/2/1లో (ఐడీఓసీ ఎదురుగా) ఉన్న ఎకరం స్థలంలో 2017లో అనధికారిక వెంచర్ వేశారు. సాధారణంగా ఎకరం స్థలంలో 30, 20 అడుగులతో రోడ్లు, పదిశాతం కమ్యూనిటీ స్థలాన్ని మినహాయిస్తే 200 గజాల చొప్పున 12 నుంచి 14 ప్లాట్లు చేయొచ్చు. కానీ ఈ వెంచర్‌లో ఏకంగా 29 మందికి 200 గజాల ప్లాట్లు ఉన్నాయంటూ రిజిస్ట్రేషన్ చేయించారు. త్వరలో నిర్మించే కలెక్టరేట్ ఎదురుగా ప్లాట్లు కారుచౌకగా వస్తున్నాయని, ఆలస్యం చేస్తే మళ్లీ అవకాశం రాదని ఆరు నెలల్లోనే ప్లాట్లు అమ్మేశారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది కూలీలు, టైలర్లు, చిన్న చిన్న కిరాణా కొట్ల నిర్వాహకులే ఉన్నారు. వీరిలోనూ మహిళలే అధికంగా ఉన్నారు.
మాకు ఇద్దరు ఆడపిల్లలు. నా భర్త కూలీ పని, నేను టైలరింగ్ చేస్తూ పైసాపైసా కూడబెట్టాం. ఇద్దరు పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని 2017లో కలెక్టరేట్ ఎదురుగా వెలిసిన వెంచర్‌లో 200 గజాల ప్లాట్ కొనుగోలు చేశాం. ప్లాట్ అమ్మిపెట్టిన బ్రోకర్, వెంచర్ వేసిన యజమాని చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఇప్పటికీ మాకు ప్లాటు దక్కలేదు. అడిగితే మహిళ అని కూడా చూడకుండా కొడుతున్నారు.
– రమాదేవి, కొత్తగూడెం
నా భర్త దుబాయ్‌లో ఉంటాడు. అక్కడ రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని, కడుపు మాడ్చుకుని కూడబెట్టిన డబ్బుతో 2017లో కలెక్టరేట్ ఎదురుగా వేసిన వెంచర్‌లో రెండు ప్లాట్లు కొనుగోలు చేశా. ఇప్పటికీ ఆ ప్లాట్లు మాకు అప్పగించలేదు. ఈ విషయమై కుటుంబంలో కలతలు వచ్చాయి. దయచేసి ఇప్పటికై నా అనధికారిక వెంచర్ల విషయంలో సర్వే జరిపి మాకు న్యాయం చేయాలి. మరొకరు నష్టపోకుండా చూడాలి.
– అరుణ, భద్రాచలం

కలల ప్రపంచం!