
22 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
ఏర్పాట్లు పూర్తి చేయాలన్న అదనపు కలెక్టర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఈనెల 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ థియరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం ఆయన వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పదో తరగతి పరీక్షలకు చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్ అభ్యర్థులకు బాబుక్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదో తరగతికి 320 మంది, ఇంటర్‌కు 300 మంది హాజరు కానున్నారని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్‌టికెట్ వెంట తెచ్చుకోవాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు, కాలిక్యులేటర్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వివరాలకు 89192 79238 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ బి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.