
సింగరేణి విస్తరణకు సహకరించండి
ఎస్‌బీఐ చైర్మన్‌తో భేటీలో
సీఎండీ బలరామ్
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి విశ్వవ్యాప్తంగా విస్తరించేలా దేశ, విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సంసిద్ధత తెలిపింది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ గురువారం ముంబైలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి, డిప్యూటీ ఎండీ సత్యేంద్రకుమార్ సింగ్, సీజీఎం శైలేష్ ఉన్నితన్‌తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. బొగ్గు ఉత్పత్తిలో అగ్రస్థానాన ఉన్న సింగరేణి త్వరలోనే దేశ, విదేశాల్లో కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించనుందని తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ లభించిందని చెప్పారు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వినియోగించుకుంటూ దేశంలోనూ పెద్ద ఎత్తున కీలక ఖనిజాల ఉత్పత్తికి సిద్ధమవుతున్నామని, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు, 5 వేల మెగావాట్ల సోలార్, థర్మల్ ప్లాంట్లు, గ్రీన్ హైడ్రోజన్, మిథనాల్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీఎండీ వివరించారు. సింగరేణి చేపట్టే భారీ ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో ఆర్థిక సహకారం అందించాలని కోరగా ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే సింగరేణి ప్రధాన ఆర్థిక లావాదేవీల (లీడ్) బ్యాంకుగా సేవలదింస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ అంతర్జాతీయ స్థాయి మైనింగ్ సంస్థగా సత్తా చాటాలని ఆకాంక్షించారు.