
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, అక్టోబర్ 7న నిర్వహించే శబరి యాత్రపై ఆలయ ఈఓ దామోదర్‌రావు ఆదివాసీ గిరిజన నాయకులతో సమావేశం నిర్వహించారు. శబరి యాత్రకు గిరిజనులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఈఓ కోరారు.
నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడుకు చెందిన గారపాటి తులసమ్మ రూ.లక్ష, బొప్పొడి కాశీబాబు–శాంతారాణి దంపతులు రూ.50వేల చెక్కును ఆలయ అధికారులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా దాతల కుటుంబసభ్యులు స్వామివారిని దర్శించుకోగా, అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. ఆలయ పీఆర్వో రామిరెడ్డి, వేదపండితులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు. కాగా, మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో శనివారం రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. పూజలో పాల్గొనేవారు రూ.1,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేయించుకోవాలని, వివరాలకు 63034 08458 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
నేడు నందీశ్వరుడికి అభిషేకం
పెద్దమ్మగుడి సముదాయంలోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీ నందీశ్వరస్వామికి పంచామృతాభిషేకం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.
నేడు జాబ్ మేళా
సింగరేణి(కొత్తగూడెం): హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 200 ఖాళీల (ప్రొడక్షన్ ట్రైనీ) భర్తీకి కొత్తగూడెం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే బీఎస్సీ చదువుకునేందుకు ఆసక్తి గలవారికి ఎంఎస్‌ఎన్ ల్యాబొరేటరీ వారు ఆర్థిక సాయం, వసతి సౌకర్యం కల్పిస్తారని తెలిపారు.
‘ఎర్త్ సైన్సెస్’లో స్పాట్ అడ్మిషన్లకు 14 మంది
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, బీఎస్సీ జియాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నిర్వహించిన స్పాట్ అడ్మిషన్లకు 14 మంది విద్యార్థులు హాజరయ్యారని ఓఎస్డీ జగన్‌మోహన్‌రాజు ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందేందుకు ఈనెల 20 వరకు అవకాశం కల్పించేందుకు యూనివర్సిటీ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం