● 104 సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాల్లేవ్.. ● తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు
బూర్గంపాడు: ఆరు నెలలుగా వేతనాలందక 104 సిబ్బంది అప్పుల్లో కూరుకుపోతున్నారు. విఽధి నిర్వహణకు రోజూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు రవాణా చార్జీలకు కూడా కటకటలాడుతున్నారు. జీతాలు చెల్లించాలని అటు అధికారులను, ఇటు ప్రజాప్రతినిధులను కోరినా ఫలితం శూన్యం. చివరకు మంత్రులు, ఆరోగ్యశాఖ కమిషనర్‌ను కలిసినా వేతనాలు మాత్రం రావడం లేదు. కనీసం దసరా పండుగకై నా చెల్లించి తమను ఆదుకోవాలని జిల్లాలోని 104 ఉద్యోగులు కోరుతున్నారు.
వివిధ ఆస్పత్రుల్లో సర్దుబాటు..
జిల్లాలో 59 మంది 104 సిబ్బంది వివిధ పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు ఫార్మసిస్ట్‌లుగా, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, ల్యాబ్ టెక్నీషియన్లుగా, డ్రైవర్లుగా, సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నారు. వీరికి గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో క్రమం తప్పకుండా వేతనాలు అందిన దాఖలాలు లేవు. 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 104 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దీర్ఘకాల రోగులకు ప్రతీ నెల వైద్యారోగ్య శాఖ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు అందించే లక్ష్యంతో 104 వాహనాలను ప్రవేశపెట్టారు. ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించగా 2022 వరకు ప్రజలకు వైద్య సేవలు అందించారు. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 104 వాహనాలను తొలగించి, ఆ సిబ్బందిని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో సర్దుబాటు చేసింది. ఫార్మసిస్ట్‌లకు, ల్యాబ్ టెక్నీషియన్లకు నెలకు రూ. 22,750, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, మల్టీపర్పస్ హెల్త్ ఆసిస్టెంట్లకు రూ.19,500, సెక్యూరిటీ గార్డులకు రూ.15,600 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని సిబ్బంది కోరుతుండగా.. ఆ మాటేమో కానీ సక్రమంగా వేతనాలు కూడా రాక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా బడ్జెట్ విడుదల చేసి తమకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ విషయమై బూర్గంపాడు సీహెచ్‌సీ సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావును వివరణ కోరగా.. 104 సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వలేదని, రాగానే వేతనాలు చెల్లిస్తామని చెప్పారు.
ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఆస్పత్రుల రాకపోకలకు రవాణా చార్జీలకు కూడా డబ్బులుండడం లేదు. కుటుంబం గడవటం కష్టంగా మారింది. కనీసం దసరా పండుగకై నా వేతనాలు అందించి ఆదుకోవాలి.
– రవి, 104 వర్కర్స్ యూనియన్ నాయకుడు
రోజూ ఆస్పత్రులకు వెళ్లి వైద్యసేవలు అందిస్తున్న మమ్మల్ని పాలకులు పట్టించుకోవడం లేదు. ఐదారు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి. పిల్లల చదువులకు కూడా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి తక్షణమే వేతనాలు అందించాలి.
– శ్రీనివాస్, 104 వర్కర్స్ యూనియన్ నాయకుడు