
కెమికల్ లారీ బోల్తా
టేకులపల్లి: అదుపు తప్పి కెమికల్ లారీ బోల్తా పడింది. త్రుటిలో డ్రైవర్, క్లీనర్‌లు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం... కర్నూల్ నుంచి భద్రాచలం వెళ్తున్న కెమికల్ లారీ బొమ్మనపల్లి వద్ద గురువారం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ , క్లీనర్ లారీ నుంచి పక్కకు దూకడంతో ప్రమాదం తప్పింది. లారీలో కెమికల్స్ ఉన్నా లీకేజీ కాకపోవడంతో ప్రమాదం జరగలేదు.
ఆలయంలో చోరీ
జూలూరుపాడు: మండలంలోని కొమ్ముగూడెం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలోకి బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. తాళం పగులగొట్టి గుర్తుతెలియని ఆలయంలోకి చొరబడ్డారు. గర్భగుడి తలుపు తాళం పగులగొట్టి అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. హుండీ కూడా పగులగొట్టారు. రెండు రోజుల క్రితమే ఆలయ కమిటీ కానుకలు లెక్కించడంతో అందులో డబ్బులు లేవు. దొంగలు అపహరించిన ఆభరణాల విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ బాదావత్ రవి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా మంగళవారం రాత్రి మాచినేనిపేటతండా గ్రామంలో ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి బంగారు, వెండి వస్తువులను చోరీ చేశారు. రెండో రోజు బుధవారం రాత్రి కొమ్ముగూడెం శ్రీ పెద్దమ్మ ఆలయంలో చోరీ జరగింది. వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.