
అతివల ఆరోగ్యంపై నజర్
17 నుంచి స్వస్థ్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం
జిల్లావ్యాప్తంగా మహిళలకు
పలు రకాల వైద్య పరీక్షలు
ఏర్పాట్లు చేసిన జిల్లా వైద్య,
ఆరోగ్యశాఖ అధికారులు
ఏర్పాట్లు చేస్తున్నాం
చుంచుపల్లి: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, దేశం బాగుంటుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అతివలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు గ్రామస్థాయి నుంచి నగరాల వరకు అన్ని చోట్లా ‘స్వస్థ్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. ఇటీవల కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో తగిన సూచనలు చేశారు. బుధవారం నుంచి జిల్లాలోని 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పల్లె దావాఖానాలు, మరో 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 153 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల పరిధిలో మహిళలకు వైద్యపరీక్షలు చేయనున్నారు.
పక్షంరోజులపాటు స్పెషల్ డ్రైవ్
పక్షం రోజులపాటు స్వాస్థ్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ స్పెషల్ డ్రైవ్ జరగనుంది. ఆరోగ్య మహిళ, ఏసీడీ సెంటర్లు, కేన్సర్ డే కేర్ సెంటర్లతో పాటు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతి ఏడాది సెప్టెంబరులో నిర్వహించే పోషణ్ మా ప్రోగ్రామ్ కూడా ఈ కార్యక్రమాలతో కలిపి నిర్వహించనున్నారు. మారిన జీవనశైలి, వాతావరణం కారణంగా కొందరు మహిళలు వ్యాధులు బారిన పడుతున్నారు. శిబిరాల్లో హైబీపీ, షుగర్, ఓరల్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్, సర్వైకల్ కేన్సర్ తదితర పరీక్షలు చేపట్టనున్నారు. రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్షయ బారిన పడే ప్రమాదం ఉన్న మహిళలను గుర్తించి టీబీ పరీక్షలను చేయనున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సికెల్ సెల్ ఎనీమియా పరీక్షలతోపాటు బాధితలకు కార్డులను అందించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. గైనకాలజీ, నేత్ర, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్ సర్జన్ తదితర వైద్యులు శిబిరాల్లో మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారు. రోగ నిర్ధారణ అయితే తగిన చికిత్స, మందులు అందిస్తారు. ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని మార్గదర్శకాల్లో సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా మహిళల అనారోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుంది.
జిల్లాలోని ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ స్వస్థ్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ అమలుపై వివిధ శాఖలకు దిశా నిర్దేశం చేశారు. అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాల్లో ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమైంది. అందరి సహకారంతో విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
– డాక్టర్ ఎస్.జయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ

అతివల ఆరోగ్యంపై నజర్