చండ్రుగొండ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తొలి విడత బిల్లుల చెల్లింపుల తర్వాత అదనంగా మరోసారి నగదు జమ చేసిన ఘటన బుధవారం చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో వెలుగు చూసింది. ఆలస్యంగా దీనిని గుర్తించిన అధికారులు లబ్ధిదారుల వద్ద నుంచి వాటిని రికవరీ చేసేందుకు యత్నిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. చండ్రుగొండ మండలానికి చెందిన ఎస్‌డీ ఇమాంబీ, సిరికొండ స్వామి, గంగారపు సుబ్బమ్మ, కునసోతు జయ, పొట్టా భవానీ, బండ ఉషారాణి, కంచర్ల తిరుమలి, ఇనుముల లక్ష్మి, కుక్కముడి రాణి, గోసుల నర్సింహారావు, సీతమ్మ, జాల పద్మకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ నెల 11వ తేదీన వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్ష చొప్పున నగదు జమ అయింది.
కాగా, వారికి అదనంగా మరోసారి ఈ నెల 15న బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమ కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు లబ్ధిదారుల వద్దకు వెళ్లి అదనంగా నగదు చెల్లింపులు జరిగాయని, ఆ నగదును తిరిగి ప్రభుత్వానికి జమ చేయాల్సిందిగా స్థానిక గృహ నిర్మాణ శాఖ అధికారులు కోరుతున్నారు. కాగా, చండ్రుగొండ మండలంతోపాటు అన్నపురెడ్డిపల్లి మండలం, జిల్లాలోని మరికొన్ని మండలాల్లో కుడా ఇలాగే జరిగినట్లు తెలిసింది.
టెన్నిస్ కోర్టు ప్రారంభం
భద్రాచలంటౌన్: ఉద్యోగులకు టెన్నిస్ క్రీడలు ఎంతో మేలు చేస్తాయని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలోని నివాస సముదాయంలలో కొత్తగా నిర్మించిన లాన్ టెన్నిస్ కోర్టును పీఓ బుధవారం ప్రారంభించి, మాట్లాడారు. టెన్నిస్ ఆడితే వ్యాయామంతో పాటు మనసుకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. క్రమం తప్పకుండా ఉద్యోగులు తమ పిల్లలు గంట పాటు టెన్నిస్ ఆడాలని సూచించారు. చెత్తా చెదారాన్ని మైదానంలో వేయొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, అలివేలు మంగతాయారు, గోపాల్‌రావు, నాగేశ్వరరావు, ఆదినారాయణ, పీడీలు వెంకటేశ్వర్లు, హరికృష్ణ ఈశ్వర్,వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
మార్గదర్శక శక్తిగా పనిచేస్తాయి..
అశ్వాపురం: ఎన్‌సీసీ శిబిరంలో పొందిన శిక్షణ, అనుభవాలు వారి భవిష్యత్ ప్రయత్నాల్లో మార్గదర్శక శక్తిగా పనిచేస్తాయని ఐటీడీఏ పీఓ రాహుల్, వరంగల్ గ్రూప్ కమాండర్ వీరచక్ర కల్నల్ సచిన్ అన్నారు. మండల పరిధిలోని మిట్టగూడెంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో పది రోజులుగా జరుగుతున్న ఎన్‌సీసీ శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ఐటీడీఏ పీఓ, వరంగల్ గ్రూప్ కమాండర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. కేడెట్లు దేశభక్తి గీతాలు, తెలంగాణ సాంస్క్రతిక నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాహుల్, సచిన్ మాట్లాడుతూ.. ఎన్‌సీసీ శిక్షణలో పొందిన అనుభవాలు నాయకత్వం, దేశభక్తి, బాధ్యతను పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్‌భద్ర, కళాశాల ప్రిన్సిపాల్ రవి బండారుపల్లి, సిబ్బంది పాల్గొన్నారు.
వృద్ధుడి అదృశ్యం
చండ్రుగొండ: మండలంలోని రావికంపాడు గ్రామానికి చెందిన బొర్రా భావ్‌సింగ్ కనిపించకుండా పోగా.. బుధవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపారు. 70 ఏళ్ల వయసున్న భావ్‌సింగ్ మంగళవారం మండలంలోని టేకులపల్లిలో ఉన్న తన కుమార్తెను చూసి వస్తానని వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా, ఆయన అక్కడకు రాలేదని చెప్పారు. భావ్‌సింగ్ ఆచూకీ తెలియకపోవడంతో కుటంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ నంబర్ 87126 82043కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ తెలిపారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
జూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండాలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రవి కథనం ప్రకారం.. మాచినేనిపేటతండాకు చెందిన బీరేల్లి సుధాకర్ ఈనెల 16న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. బుధవారం ఇంటికి వచ్చి చూడగా.. చోరీ జరిగిందని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ శ్రీలక్ష్మి.. సిబ్బంది, క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.12 వేల విలువ చేసే వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రవి తెలిపారు.